బొంబాయి పట్టణవాసీ, పేరున్న బారిష్టరూ అయిన జోనఫ్ బాప్తిష్టాగారు వారి వెనుకాలే గట్టిగా కేకవేస్తూ, "శంకరన్‌నాయరుగారూ| మీతలను ఇక్కడవదలి, నాతలను మీ భుజాలమీద ఎక్కించుకున్నా" రని అరిచారు. శంకరన్‌నాయరు గేటుదాటేలోపలే ఆయన్ని పట్టుకుని, "నీ టోపీని వదలి నాటోపీ పట్టుకుపోతున్నావయ్యా" అంటూ హెచ్చరించి తన టోపీని తాను తెచ్చుకున్నారు.
ఈ ప్రకారంగా నడచిన యీ కాన్పరెన్స్‌లో చెప్పుకోదగ్గ విషయాలేవి సాధింపబడలేదు. తర్వాత సర్ శంకరన్‌నాయరు "Gandhi and Anarchy" అన్న ఒక పుస్తకం వ్రాశాడు. ఈ దేశానికి కావలసిన రాజకీయ స్వాతంత్ర్యం విషయంలో ఆయనకున్న అభిప్రాయం అది.
ఈ సంఘటనలన్నీ 1922 మార్చి 13 వ తేదీనాడు జరిగిన గాంధీగారి నిర్బంధానికి ముందే సంభవించి వుండడాన్ని, వైస్రాయి గారికీ ఆయన కౌన్సిల్ వారికీ బలం చేకూరింది. ఆ రోజులలో యీ విషయాలపై వచ్చిన విమర్శనలూ, విరసనలూ-అవి యేమూలనుంచి, ఎవరివద్దనుంచి వచ్చిన వయినా-గాంధీగారూ పట్టించుకోలేదు. పైగా అహమ్మదాబాదు సెషన్సు కోర్టులో ఆయన ఇచ్చిన "Sermon on the Mount" వంటి వాజ్మూలంతో ఆయన కీర్తి నలుదిశలా దేదీప్యమానంగా వ్యాపించింది.
5
గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ
1922 వ సంవత్సరం చరిత్రాత్మక మయినదని చెప్పక తప్పదు. అది మనవారి కందరికీ చాలా ముఖ్యమయిన సంవత్సరం. నాగపూరు కాంగ్రెసులో [1]ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీని ప్రత్యేకంగా గుర్తించారు. అప్పటికే చాలాకాలం క్రిందట అంధ్రరాష్ట్ర
- ↑ 1920 లో