నిర్వాహక సంఘ సభ్యునిగా మాత్రమే కాదనీ, "స్వరాజ్య" పత్రికా సంపాదకునిగా కూడా నా విధిని నిర్వహించాలనే అభిలాషే నన్నాల్లా లాక్కుపోయేవని లోగడ మనవిచేసి వున్నాను. 1922 ఆరంభంలో ముల్తాన్ సంఘర్షణ, తర్వాత షహజాన్‌పూర్ సంఘర్షణ చరిత్రాత్మకం అయ్యాయి.
అఖిల పక్ష సమావేశం
అటువంటి విప్లవాత్మక దినాలలోనే, ఆ 1922 లోనే సర్ శంకరన్‌నాయరుగారి అధ్యక్షత క్రింద బొంబాయిలో అఖిల పక్ష రాజకీయ మహాసభ జరిగింది. ఒకప్పుడు సర్ శంకరన్‌నాయరు కాంగ్రెసు అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన వ్యక్తే. ఆయన రాజకీయ విధానానికి అయనేసాటి. రీడింగ్ ప్రభువు ప్రతిపాదించిన రాజీ సూచనలను సరి శీలించగల వ్యక్తి సర్ శంకరన్‌నాయరేనని. శంకరన్‌నాయర్ లాంటి రాజకీయ వేత్తే ఆ ప్రతిపాదనలకు సరియయిన నిర్వచనమూ, స్థానమూ ఇవ్వగలడనే తలంపుతో మాలవ్యాజీ వారిని, అధ్యక్ష స్థానంలో నిలిపి ఆ బొంబాయి సమావేశానికి ప్రత్యేకత కలిగించారు.
నిజంగా ఆయన హృదయాంతరాళంలో శంకరన్‌నాయర్ వల్ల కార్యసాధనం అవుతుందనే నమ్మిక ఉంది. కాని గాంధీ విధానాలకు శంకరన్‌నాయరు ప్రబల విరోధి అన్నమాట మాలవ్యాగారు విస్మరించి ఉండవచ్చును. గాంధీగారి విధానాలనీ, కాంగ్రెసు చర్యలనూ ఖండించి, బ్రిటిషువారి యందు తనకున్న గౌరవాభిమానాలనూ, విశ్వాసాన్నీ రుజువు పరచుకోవచ్చుననే ఆలోచనతో శంకరన్‌నాయరు ఆ అధ్యక్ష స్థానానికి అంగీకరించాడు. అ సమావేశంలో గాంధీగారూ ఉపన్యసించారు.
అధ్యక్షుని "వాకౌట్"
సర్ శంకరన్‌నాయరు ఉపన్యసిస్తూ, ఉపన్యాసం మధ్యలో ఉద్రేకపూరితుడయి, తన అధ్యక్ష స్థానం విడిచి, నిరసన సూచకంగా సభా మండపాన్ని వదలి, ఆచార విరుద్దంగా బైటకు వెళ్ళిపోయాడు. ఆ అవేశంలో తన టోపీని అక్కడ వదలి, ఇంకొకరి టోపీని నెత్తిన పెట్టుకొని బైటకు నడిచాడు.