పుట:Naajeevitayatrat021599mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xix

పురుష పుంగవము ఆత్మ లాభముతో సంతుష్టి చెందక అన్య క్షేమము ఆకాంక్షిస్తుంది. ఉత్తముడు దేశ సౌభాగ్యము కోసము నిజశక్తులు వినియోగిస్తాడు. దేశసేవ వివిధ విదాల జరుగుతుంది. ఉత్తేజకములైన ఉపన్యాసములవల్ల గాని, ఉత్తమ పత్రికా నిర్వహణమువల్ల గాని, ఉదారాచరణవల్ల గాని పురుషుడు కర్మవీరుడు కాగలుగుతాడు. పంతులు వీ టన్నిటిలో పరిశ్రమ చేసి కలికాప్రాయముగా అంతర్నిహితమైన దేశభక్తిని కమనీయ కుసుమముగా వికసింపజేసినాడు. మహాపురుషుల సాంగత్యమువల్లను, సహజ ప్రతిభవల్లను ఆంధ్రకేసరికి పంచాశద్వర్ష ప్రాంతములో జీవ యాత్రలో లక్ష్యము గోచరించింది.

ఈ గ్రంథములో వివృతమైన వ్యక్తికీ, నాకు సుపరిచితమైన మూర్తికీ వ్యత్యాసము కనపడడము లేదు. ఆయన మాటల వలెనే ఇందులో పలుకులు కూడా తేటలు. రచన సానపెట్టిన రత్నమువలె రమణీయము. విస్తరించి విశేషములు చెప్పినట్లయితే మరింత దీప్తి కలిగేది తాత్పర్యార్థము తలపోసినట్ట యితే కథానాయకుడు ఆంధ్ర కేసరి అని అన్వర్థము అవుతుంది.


ఇతి శివమ్!

సాహితీ సమితి, తెనాలి,
1946 ఆగష్టు 20..
శివ శంకర శాస్త్రి