Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాగడంచేత గాంధీగారి కీర్తి దశదిశలా మార్మోగింది. గాంధీగారు మినహాగా తక్కిన రాజకీయవేత్త లందరునూ క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ 144, 108 సెక్షెన్ల కిందనో, క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ యాక్ట్ కిందనో అరెస్టు చెయ్యడం జరిగింది.

రాజీ ప్రతిపాదనలు

ప్రముఖ రాజకీయవేత్తల మధ్య ఉన్న స్వల్ప భేదాభిప్రాయాలను గమనించిన రీడింగ్ ప్రభువు, ఆ అభిప్రాయభేదాలను ఆధారంగా తీసుకుంటూ, వాటికి అనుగుణంగా రూపొందించిన పదకాలతో యుక్తి యుక్తంగా కార్యసాధనకు ఉపక్రమించాడు.

కలకత్తా సమీపంలో అలీపూరు జైలులో నిర్బంధింపబడి వున్న చిత్తరంజన్ దాస్‌గారికి కొన్ని రాజీ ప్రతిపాదనలను సూచించి,[1] ఆప్రతిపాదనలనే వేరే ప్రాంతంలో ఇంకో జైలులో నిర్బంధింప బడిన పండిత మోతీలాల్ నెహ్రూగారికి అందజేశాడు.[2]

  1. 1921 డిసెంబరులో.
  2. కరాచీలో జరిగిన అఖిలభారత ఖిలాఫకత్ మహాసభ (1921 జూలై)లో పాల్గొన్నందున శిక్షింపబడిన వీరిని "కరాచీ ఖైదీ" లన్నారు, మహాసభ చేత వీరు, బ్రిటిషు ప్రభుత్వం క్రింద భారతీయ సైనికులు పనిచేయరాదనే తీర్మానం అంగీకరింప జేశారు. కొందరు ఉలేమాలు ఆతీర్మానాన్ని "ఫత్వా" (శ్రీముఖం)గా మహమ్మదీయులకు జారీ చేశారు. ఆ సందర్భంలో శిక్షితులైన వారిని "ఫత్యా ఖైదీ" లన్నారు. ఖలీఫా అయిన టర్కీ సుల్తానుకు యుద్ధ సమయంలో చేసిన వాగ్దానాలకు భంగకరంగా బ్రిటను, యుద్ధం ముగిశాక, ఇస్లాం మత పీఠ సామ్రాజ్య (ఖిలాఫత్) భాగాలను స్వాహా చేసింది. అది మహమ్మదీయులను కోపోద్రక్తుల్ని చేసింది. భారతీయ మహమ్మదీయులతో హిందువులు చేతులు కలిపి, వాటిని తిరిగి టర్కీకి ఇప్పించడానికి, ఖిలాఫత్ ఉద్యమం నడిపించారు.