పుట:Naajeevitayatrat021599mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'నా జీవితయాత్ర' ప్రథమ ఖండము

ప్రథమ ముద్రణ (1946)కు

శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి

పరిచయము

అమెరికా దేశీయుడు ఒకడు స్వీయచరిత్రకు Education అని పేరు పెట్టినాడు. ఆంగ్లేయ స్త్రీ My Apprenticeship అనీ, ఐర్ దేశీయుడు Summing up అనీ తమ చరిత్రలకు నామములుంచి నారు. వారి ఉద్దేశానుసారముగా ఆ నామకరణము అనుగుణమైనది. మన నాయకుడు ఆంధ్రకేసరి పూజ్యశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు "నా జీవితయాత్ర" అని స్వీయచరిత్రకు పేరు పెట్టడమువల్ల జీవితాన్ని యాత్రగా భావించినట్టు కనిపిస్తున్నది. ఒక దృష్టితో చూస్తే జీవితము యాత్రాప్రాయమే. కొందరు యాత్రికులు లక్ష్య శుద్ధితో బయలుదేరి గమ్యస్థానము చేరుతారు. చాలమంది యాత్రచేస్తూ అవాంతర విషయాలలో అడుగు పెట్టడమూ, కొంత దూరము పోవడమూ, పక్కకు తిరగడమూ, కడకు గమ్యస్థానము చేరడమూ సంభవిస్తుంది. ప్రకాశం పంతులు ద్వితీయ శ్రేణిలో చేరిన యాత్రికుడు. నలుగురితో పాటు జీవయాత్ర ప్రారంభము చేసినప్పటికీ క్రమేణ నాయకుడై ఆఖరుకు ఆంధ్రకేసరి అయినాడు.

పూవు పుట్టగానే పరిమళము అన్నట్టు పంతులు బాల్యమునుంచీ ప్రముఖుడే. పల్లెపట్టున గాని, పట్టణాలలో గాని, ప్రధాన నగరములో గాని, చివరకు పరదేశములో గాని ఆయన ప్రాముఖ్యము ఎప్పుడూ ప్రకట మవుతూనే ఉన్నది. సహజముగానే దృఢగాత్రు డైన వానికి బుద్ధివైభవము తో డైనప్పుడు ప్రాముఖ్యము కలగక తప్పదు. కృష్ణానదికి దక్షిణమున రాతి భూమిలో పుట్టుక, సావాసగాండ్లతో సాము గరిడీలు, స్వచ్ఛందవృత్తి, అనూచాన సంపదను బట్టి ఆరువేల నియోగికి