పుట:Naajeevitayatrat021599mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోను, రాజధానిలోను ఉండే జిల్లా కోర్టులలోను ఎక్కువ ప్రాక్టీసు సంపాదించి పనిచేస్తూ ఉండేసంగతి కూడా వ్రాశాను. నేను న్యాయవాదుల్లో ఎక్కువ డబ్బు సంపాదించి జయప్రదంగా న్యాయవాద వృత్తి నడిపిస్తూ ఉండే ప్రధాన న్యాయవాదుల్లో ఒకణ్ణిగా ఉండేవాణ్ణి. నెల ఒకటికి ఆరు, ఏడువేల రూపాయలు ఆర్జన చేస్తూ ఉన్న సంగతికూడా వ్రాశాను.

కలకత్తాలో న్యాయవాదిగా ఉన్న సి. ఆర్. దాసు, నేను చాలా సంవత్సరాలనించి స్నేహంగా ఉండేవాళ్ళం. ఆయన న్యాయవాదవృత్తి వదలివేసినప్పుడే పండిత మోతీలాలు నెహ్రూకూడా దేశంలోని న్యాయవాదుల్లో ముఖ్యుడుగా ఉండి, చాలా ధనం ఆర్జిస్తూ ఉండేవాడు. ఆయన్నికూడా నేను బాగా ఎరుగుదును. వీరిద్దరూ కాంగ్రెసు ఉత్తరువు ప్రకారం న్యాయవాద వృత్తులు ఒదిలివేశామని ప్రకటించిన తరవాత, నేను మద్రాసు నగరంలో ఉండే న్యాయవాదుల్లో మొట్టమొదట న్యాయవాదవృత్తి విడిచిపెట్టి వేశాను.

అప్పటికి మద్రాసు నగరంలో రాజకీయాలు కేవలం మితవాదుల నాయకత్వంకింద నడపబడుతూఉండేవి. నాకు లాకాలేజీలో ప్రొపెసరుగా ఉన్న వి. కృష్ణస్వామయ్యరుగారు హైకోర్టున్యాయ వాదవృత్తిలో అగ్రగణ్యులుగా ఉంటూ మద్రాసులో కాంగ్రెసు నాయకులుగా ఉండేవారు. 1907 వ సంవత్సరంలో జరిగిన సూరతు కాంగ్రెసులో మితవాదులకీ, అతివాదులకీ తగువులు వచ్చి కాంగ్రెసు విచ్చినం కావడమూ, తలకాయలు బద్దలుకావడమూ, కాంగ్రెసుసభ చెల్లాచెదరు అవడమూ మొదలయిన వాటిని గురించి ఇదివరకు సవిస్తరంగా వ్రాశాను.

ఆ సూరత్‌కాంగ్రెసు సమయంలో కూడా కృష్ణస్వామయ్యరు గారే నాయకులుగా ఉండేవారు. వారి శిష్యులు, స్నేహితులు అందరూ మితవాదులే అయి, నాయకత్వం వహించి కాంగ్రెసు ప్రతినిధులుగా ఉంటూ పనిచేస్తూ ఉండేవారు. ఈ కారణంచేత మద్రాసు నగరం జాతీ