పుట:Naajeevitayatrat021599mbp.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాగ్రహపోరాటాలు సుప్రసిద్ధాలే! ఆ విజయాలు కూడా ఆయనకి తోడ్పడ్డాయి. ఎంతయినా ఆర్భాటంలేని మనిషి అవడంచేత, ఆయన వచ్చిందీ, పోయిందీ కూడా ఎవరూ కనిపెట్టలేక పోయేవారు.

నా మిత్రుడు దేశబంధుదాసు సంగతి కొద్దిగా ఇదివరకు వ్రాశాను. ఆయల లక్షలు ఆర్జించి, వెచ్చించి, బాగా పలుకుబడి సంపాదించాడు. ఆయన జీవితపద్ధతి అంతా పూర్తిగా ఆంగ్లానుకరణంగా ఉండేది. బిసెంటు తన అధ్యక్షోపన్యాసంలో, "మీరు నన్ను సైన్యాధిపతిగా ఎన్నుకున్నారు కనక, నా ఆజ్ఞలు శిరసావహించవలసిందే!" అని గర్జించింది. ఆ మాటలకి దాసు, బిపిన్‌చంద్రపాలూ కూడా కొంచెం కటకటపడ్డారు. దాసు నాతో "చూడండి! ఆమె అహంకారం! ప్రజాస్వామిక సంఘంలో ఇదివరకు ఎవరు ఇల్లాగ అనగలిగారు!" అన్నాడు. నేను "ఆమె మన దగ్గిరనించి అట్టి శిక్షణ ఆశించడంలో తప్పేమిటి?" అన్నాను. కాని, దాసు ఆ అధికారపు అభిప్రాయానికి హర్షించలేదు. దానికి కారణాలని గురించి తర్జనభర్జన చెయ్యడంకంటె, ఆయన మనస్తత్వం అల్లాంటిది అని అనుకోవడం మంచిది. అంతేకాదు; నాయకత్వం కోసం అంచనాలు వేసే నాయకుల మనస్తత్వాలు అల్లాగే ఉంటాయి. అందులో అంతగా వైపరీత్యం కూడా లేదు. ఏ వృత్తి లోనైనా పోటీ చెయ్యడంకోసం ఎత్తుపై ఎత్తులు వెయ్యడం చూస్తూనే ఉన్నాంగదా! అది రాజకీయాల్లో మరీ ఎక్కువ. మహా నాయకులైనవారు ఆ సుడిగుండంలో పడిపోయినప్పుడు చూడడంలో మరీ విశేషం ఉంది!

26

స్వరాజ్య పత్రిక

'స్వరాజ్య' పత్రిక 1921 వ సంవత్సరం అక్టోబరు 29 వ తారీఖుని ప్రారంభించబడింది. మొదటి సంచిక ఆ రోజుననే బయలు దేరింది.