పుట:Naajeevitayatrat021599mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తంమీద దేశంలో ప్రస్ఫుటంగా పెరుగుతూ ఉన్న తీవ్రరాజకీయాందోళన ప్రభుత్వానికి కొంత కంగారు పుట్టించింది. లండన్ ఢిల్లీల మధ్య బోలెడు గ్రంథం నడిచింది. ఇండియామంత్రి మాంటేగ్ ఆగష్టు 20 తేదీని ప్రఖ్యాతమైన తన ప్రకటన వెల్లడించాడు. అందులో బ్రిటిషువారు ఇండియాకి క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వం ఇవ్వడానికే సంకల్పించారనీ, పార్లమెంటు ఎదట పెట్టబోయే సూచనలు చర్చించడానికి ప్రజలకి అవకాశం ఇస్తారనీ ప్రకటించాడు. అన్నింటికన్నా ముఖ్యం అయినది అతను ఈ దేశానికి వచ్చి ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుంటానని కావించిన ప్రకటన. ఈ ప్రకటనతోపాటు సెప్టెంబరు 16 వ తేదీని బిసెంటు ప్రభృతుల్నికూడా విడుదలచేశారు.

మాంటేగ్ రాక రాజకీయ సంస్థల్లో ఎక్కడాలేని సంచలనమూ కలిగించింది. కాంగ్రెస్ తాత్కాలికంగా సంకల్పించిన సాత్విక నిరోధ సంకల్పం ఉప సంహరించుకుంది. నిర్భంధంనించి వచ్చిన బిసెంటమ్మే దాని ప్రసక్తి విడిచిపెట్టింది. దేశంలోని ఇతర రాజకీయసంస్థలు రాజ్యాంగ ప్రణాళికలు తయారుచెయ్యడంలో మునిగిపోయాయి. అది వరకులేని అనేక కొత్త సంఘాలు కూడా బయలుదేరాయి. ఈ కొత్త సంఘాలలో మనరాష్ట్రానికి ముఖ్యమైనది బ్రాహ్మణేతర మహాసభ.

బ్రాహ్మణేతర పక్షానికి ప్రధాననాయకుడు డాక్టరు టి. యం. నాయరు. ఆయన చాలా సరసుడు. ట్రిప్లికేసుడివిజనుకి కార్పొరేషను సభ్యుడు. ఆయన ప్రజల ఆరోగ్యవిషయాల్లో ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉండేవాడు. తిరువళిక్కేణి డివిజన్‌లోని చెరువుల్లో బట్టలు ఉతికి అనారోగ్యం కలిగించడంచేత ఆయన పై పనులు నిషేధిస్తూ ఉత్తరువులు జారీ చేశాడు. దాంతో ట్రిప్లికేనులోని అయ్యర్లు, అయ్యంగార్లు ఆయనమీద కక్షకట్టి మరుసటి కార్పొరేషన్ ఎన్నికలలో ఆయన్ని ఓడించారు.

ఆ తరవాతే, ఆయన బ్రాహ్మణేతరపక్షానికి నాయకుడు