పుట:Naajeevitayatrat021599mbp.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

అతివాద సంచలనం

కాంగ్రెస్ మితవాదుల నాయకత్వానికి స్వాధీనం అయినప్పటినించీ అది చాలా సాధారణమైన లాంఛన వ్యవహారం అయిపోయింది. మరుసటి సంవత్సరం, - అంటే 1908 వ సంవత్సరంలో - మద్రాసులో సమావేశమైన కాంగ్రెసు కేవలమూ జాతీయవాదం మీదనే దాడి ప్రారంభించింది. ఆ సంవత్సరమే లోకమాన్యుడివంటి మహనీయుణ్ణి రాజద్రోహి నేరానికి కారాగారంలో నిర్భంధించారు. పంజాబులోనూ, వంగదేశంలోనూ కూడా నిర్భంధ చర్యలు జోరుగా సాగాయి. ఆనాటి అమృత బజార్ పత్రిక ప్రభుత్వాగ్రహానికి గురిఅయినా ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉండేది. ఏమైనా మద్రాసులో మాత్రం మితవాదానికే ఎక్కువ ప్రాబల్యమూ, పలుకుబడీ ఉండడంచేత నేను అంతగా రాజకీయాల్లో పాల్గొనలేదు. దేశంలో 1914 వరకూ కూడా మళ్ళీ జాతీయవాదుల బలం కనబడలేదు.

1915 లో భారత స్వాతంత్ర్య సమరంలో మళ్ళీ నూతన జాతీయ వికాసం కలిగిందని చెప్పాలి. యూరోపులో యుద్ధం అంటుకుంది. దేశాన్ని రాజభక్తి పరాయణత్వంతో ముంచి తేల్చిన మితవాద నాయకత్వం అంటే అందరికీ విసుగు పుట్టింది. ప్రభుత్వం నిరంకుశత్వమూ, అందులోనూ యుద్ధం రావడంతోటే సైనికులకోసము, ధనంకోసమూ అది అవలంభించిన పద్ధతులూ చూస్తే, దేశీయుల్లో బాగా సంక్షోభం కలిగింది. ఇది ఇల్లా ఉండగా ఆరు సంవత్సరాలపాటు కారాగారం అనుభవించిన లోకమాన్యుడు మళ్ళీ దేదీప్యమానమైన ప్రభతో రాజకీయ రంగంలో ప్రవేశించాడు. 1908 వ సంవత్సరంలో ఆయన్ని శిక్షించినవాడు జడ్జీ ఒక అప్రస్తుత ప్రసంగం చేశాడు. దానికి జవాబుగా ఆయన, "నా స్వాతంత్ర్యం కంటె నా నిర్భంధమే మా దేశానికి ఎక్కువగా శ్రేయస్కరం కాగల,"దని అన్నాడు. ఆయన అన్న