పుట:Naajeevitayatrat021599mbp.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాల్గొనకపోయినా ఈ విషయంలో మాత్రం అతిధైర్య చూపించాడు. రాజకీయాలల్లో కిందుమీదయిన సర్ శంకరన్‌ నాయరుగారు కూడా సమయానికి ఇల్లాంటి అభిప్రాయమే వెలిబుచ్చాడు. బహుశ: భాష్యం అయ్యంగారి అభిప్రాయం మీదనే మద్రాసుప్రభుత్వం పాల్ ఉపన్యాసాలకి ఆయనమీద చర్య ఏమీ తీసుకోలేదు అనుకుంటాను. కాని పాల్ మాత్రం కొంచెం జాగా ఎరిగి బైఠాయించే మనిషి. నేను యిల్లాంటి సాహసమైన పనిచెయ్యడానికి వచ్చినవాడు ధైర్యంగానే వుంటాడనీ, ఎందుకైనా సిద్ధంగానే వుంటాడనీ అనుకున్నాను. కాని నాకు చాలా ఆశాభంగం కలిగించి, కొన్ని ఉపన్యాసాలు అయ్యాక శంకరన్ నాయరుగారి సలహా అంగీకరించి మెల్లిగా మద్రాసుకి స్వస్తిచెప్పాడు. ఆయన మీటింగులకి అధ్యక్షత వహించవలసి వచ్చినప్పుడు ఏమి వచ్చినా సిద్ధపడడానికి సంకల్పించుకునే నేను అంగీకరించాను. దానివల్ల గడబిడ మాత్రం ఏమీ జరగలేదు.

22

సూరత్ కాంగ్రెస్

తరవాత కొద్దిరోజులకి సూరత్ కాంగ్రెసు అయింది. కాంగ్రెస్ చరిత్రలో సూరత్ సమావేశం చాలా చరిత్రాత్మకం అయింది. అప్పట్లో 'మితవాదులు', 'అతివాదులు' అని రాజకీయవేత్తల్లో ఏర్పడ్డ చీలికలు సూరత్‌లో తీవ్రమయిన సంఘర్షణకి వచ్చి నిర్దిష్టంగా వేరయి పోయాయి. అప్పటికి దేశంలోని 'అతివాదులకి' లాలా లజపతిరాయి, తిలక్, పాల్ ప్రభృతులు నాయకులు. మితవాదులకి సర్ ఫిరోజిషా మెహతా, గోఖలే, సురేంద్రనాధ బెనర్జీ ప్రభృతులు నాయకులు. మన సుబ్బారావు పంతులుగారు తత్వంలో మితవాది అయినా కాస్త మధ్యస్థులు. ఆ కాలంలో కాంగ్రెస్‌కి ఫిరోజిషా మెహతా నియంత వంటివాడే. కాంగ్రెస్ సంఘాలు అనిగాని, ప్రతినిధుల్ని ఎన్నుకోవడంగాని