పుట:Naajeevitayatrat021599mbp.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భించాను. క్రమంగా రాజకీయాల్లో జోక్యం కలిగించుకోవడం ప్రారంభించాను. అప్పట్లో మద్రాసులో రాజకీయంగా ప్రముఖులైన వారు, సర్ సి. యస్. శివస్వామి, వి. కృష్ణస్వామయ్యరు, న్యాపతి సుబ్బారావు పంతులు, జి. సుబ్రహ్మణ్య అయ్యరుగార్లూ, తదితరులూను.

నేను బారిష్టరుగా ప్రాక్టీసు ప్రారంభించిన కొద్దిరోజులకే బెంగాలు నాయకుడైన విపిన్‌చంద్ర పాల్ మద్రాసులో ఉపన్యాసాలు యివ్వడానికి వచ్చాడు. ఆయన అప్పటికే 'గొప్ప వక్త' అని పేరు పొందాడు. అప్పుడు మద్రాసులో భాష్యంఅయ్యంగారు అడ్వకేటు జనరల్. శంకరన్‌ నాయరుగారు గవర్నమెంటు ప్లీడరు. పాల్ మద్రాసు బీచిలో వరసగా ఉపన్యాసాలు యిచ్చాడు. మొదటి ఉపన్యాసం అయ్యాక ఆయన మీటింగుకి అధ్యక్షుడు ఎవ్వరూ దొరకలేదు. సభానిర్వాహకులు నన్ను అడిగితే నేను అంగీకరించాను. అప్పుడు పాల్ నిజంగా నిప్పులు కురిపించేటంత తీవ్రంగా ఉపన్యాసాలు యిచ్చాడు. ఆయన చెప్పిన దాంట్లో బే సబబు ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఆ ఉపన్యాసాలు గవర్నమెంటు అధికారులకి తెలుస్తూ వుండేవి. భాష్యం అయ్యంగారు సభలో కూర్చోడానికి ధైర్యం చాలక బీచి ఒడ్డున మామూలుగా షికారుగా నడుస్తూ వున్నట్టు మెల్లిగా పచారుచేస్తూ వింటూ వుండేవాడు. కాంగ్రెస్ అధ్యక్షుడై ప్రభుత్వ ప్రాపకం సంపాదించిన శంకరన్ నాయరుగారు పాల్‌తో, "మీరు ఉపన్యాసాలు మానివేసి, వెంటనే మద్రాసునించి వెళ్లకపోతే, మిమ్మల్ని అరెస్టు చేయవలసి వస్తుం" దని చల్లగా సలహా యిచ్చాడు. వృద్ధిలోకి రాదలచుకున్న బారిష్టరువి, నీకీ గొడవ ఎందుకని నాకుకూడా చాలామంది స్నేహితులు సలహా యిచ్చారు.

ఈ సందర్భంలో అడ్వకేటుజనరల్ భాష్యం అయ్యంగారిని గురించి ఒక విషయం చెప్పడం చాలా అవసరం. పాల్ ఉపన్యాసాల మీద భాష్యం అయ్యంగారి అభిప్రాయంకోసం గవర్నమెంటు అవి అన్నీ సేకరించి ఆయన దగ్గిరికి పంపించింది. దానిమీద ఆయన సాహసించి పాల్ చెప్పిన మాటలు ఉద్రేకపూరితంగానే వున్నాయి కాని, రాజద్రోహం లేదని వ్రాశాడు. జీవితంలో ఆయన రాజకీయాల్లో