పుట:Naajeevitayatrat021599mbp.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెయ్యడంకూడా అపరాధం అయిపోయిన రోజులు వచ్చాయి. 1905-6 సంవత్సరాల ప్రాంతంలో తిలక్‌పటంకోసం రాజమహేంద్రవరంలో ఎన్నో ఇళ్ళు సోదా చేశారు. రాజకీయాందోళన క్రమంగా చినికి చినికి గాలివాన అయి తమ సామ్రాజ్యపు పునాదులకికూడా హాని కలిగిస్తుంది అనే భయంతో ఆంగ్లపాలకులు దేశం అంతా - ముఖ్యంగా బెంగాల్లో - నిర్భంధ విధానం ప్రారంభించారు. ఇంత జరుగుతూ వున్నా నాయకత్వం వహించి వున్న మితవాదనాయకులు తగిన రీతిని అసమ్మతులు తెలపలేక పోవడంచేత ప్రభుత్వం మరింత ధైర్యంతో నిర్భంధవిధానం సాగించింది.

స్వరాజ్యం అనే పదమే అపరాధంగా పరిగణింపబడుతూ వున్న ఆ రోజుల్లో నేను లండనులో దాదాభాయి నౌరోజీ సన్నిధిలో ఉండడం తటస్థించింది. ఈ వార్తలు చూసినప్పుడు ఒకసారి తేజశ్శాలి అయి యోగీశ్వరుడులా వున్న ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. అప్పుడే ఆయన భారతదేశం వెళ్ళి స్వరాజ్యం అనే ఆదర్శం బహిరంగంగా వెల్లడించాలని నిశ్చయించు కున్నారు.

ఆ నాటి మితవాదులు తరవాత కాలానికి చెందినవాళ్ళ మోస్తరుగా కాక, తమ సిద్ధాంతాలు అంటే చాలా పట్టుదల గలిగి వుండే వాళ్ళని నా అభిప్రాయం. ప్రభుత్వం వాళ్ళ మొరలూ, ప్రార్థనలూ,ఆశ్రయింపులూ, అనునయాలూ ఎంతగా పెడచెవిని పెట్టినా, వాళ్ళు మాత్రం మారడం అనేది వుండేదికాదు. మితవాదులు, వైస్రాయి తమ మాట వినకపోతే పోనీ ఇంగ్లీషు దొరగారిమాట అయినా వినకపోతాడా అని వైస్రాయిగావున్న లార్డు కర్జన్‌కాలంలో సర్ హెన్రీ కాటన్‌ని కాంగ్రెసు ప్రెసిడెంటుగా చేసి, ఆయనదగ్గిరికి పంపించాలని సంకల్పించారు. పాపం! వైస్రాయి ఆఖరికి కాటన్‌ని చూడడానికి కూడా అంగీకరించలేదు.

బెంగాలు విభజన తరవాత వచ్చిన ఆందోళన దేశంలోని మితవాద తీవ్రవాదశక్తుల్ని పూర్తిగా రెండు చీలికలుగా విభజించింది. నేను ఆ కాలంలోనే లండన్‌నించి తిరిగివచ్చి మద్రాసులో ప్రాక్టీసు ప్రారం