పుట:Naajeevitayatrat021599mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెయ్యడానికి లండన్ ఇండియన్ సొసైటీవారు ఆహ్వానించిన మితవాద ప్రముఖుడు, గోఖలేకూడా ముందు తను మాట్టాడదలచుకున్నవి వ్రాసి పంపవలసినస్థితిలో వుంటే యిక యితరుల సంగతి చెప్పాలా? ఈ మితవాదం అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించి, వాళ్ళ యాజమాన్యం కింద దయాధర్మ భిక్షంగా, కొంచెం కొంచెం రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించాలనే ఆశయం - అప్పటికి విద్యాధికుల మనస్సుల్లో బాగా జీర్ణించి వుంది. బ్రిటన్‌లోనూ, యితర దేశాల్లోనూ స్వాతంత్ర్యం అన్నా ప్రజాస్వామికం అన్నా అర్థమయినట్లు మన వాళ్ళకి అర్థం కాలేదు. ఏమంటే - స్వార్థపరులైన ఆంగ్ల రాజనీతిజ్ఞులు మనదేశంలో అనేక మతాలూ, కులాలు వున్నాయనీ, ఒక ప్రజాస్వామికంకింద వీళ్ళందరూ ఒక తాటిమీద నడవడం అసంభవమనీ వ్రాశారు. ఇవి వాళ్ల మనస్సులకి బాగా పట్టుకున్నాయి. లండనులో డబ్లియు. సి. బోనర్జీ - (ప్రథమ కాంగ్రెసు అధ్యక్షుడు) పోయినప్పుడు శ్మశానంలో రమేశచంద్రుదత్తువంటి విద్యావేత్తా, బుద్ధిశాలీ కూడా తీవ్రవాదుల చర్యల్ని విమర్శించాడంటే ఇంక వేరుగా చెప్పేది ఏమిఉంది?

కాంగ్రెసు నాయకత్వం స్వల్పసంస్కరణలకోసం అంటే నిర్భందోచిత ప్రారంభవిద్య, న్యాయశాఖా కార్యనిర్వాహకశాఖల విభజనం, దేశీయులకి ఉన్నతోద్యోగాలు యివ్వడం, శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెంచడం, ఐ. పి. యస్. పరీక్షలు ఇండియాలో కూడా జరిపించడం మొదలైన విషయాలకోసం ఆందోళన జరిపిస్తూ వుండగా మహారాష్ట్రదేశంలో లోకమాన్యుడు, పంజాబ్‌లో లాలా లజపతిరాయ్, బంగాళాదేశంలో విప్లవ వీరులు స్వరాజ్యం అనే ఆదర్శాన్ని ధైర్యంతో ప్రతిపాదించి కష్టాలపాలు అయ్యారు. స్వాతంత్ర్య రథానికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు. దేశంలో వుండే కోర్టులు ఇంగ్లండులోని స్టార్‌ఛేంబర్సు మాదిరివే అవడంచేత ఈ దేశభక్తులు స్వరాజ్యం కోరడమే అపరాధంగా పరిగణింపబడి, వాళ్ళకి కారాగృహప్రాప్తి కలుగుతూ వుండేది. వాళ్ళ పేర్లు ఉచ్చరించడం, వాళ్ళ పటాలు ఇంట్లో పెట్టుకోవడం ఆఖరికి 'వందేమాతరం' అని మాతృదేవికి నమస్కారం