పుట:Naajeevitayatrat021599mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజమహేంద్రవరంలో ప్రాక్టీసుచేసే కాలంలో - అంటే 1894 - 1900 సంవత్సరాల మధ్యలో - కాంగ్రెస్సునిగురించి, సంవత్సరానికోమారు ఉత్సాహంగా చెప్పుకోవడమే ఉండేది కాని, స్వాతంత్ర్య స్వరూపంగాని, దానికి అవసరమైన కార్యక్రమ స్వరూపం గాని అవగాహనే కాలేదు. సిపాయి విప్లవం పాలకులకీ, పాలితులకీ కూడా అనేకపాఠాలు నేర్పింది. పాలకులు కేవలం జబర్‌దస్తీ సాగదనీ, దేశంలో ద్విభాషులతోపాటు మచ్చుపిట్టల్ని మరిగించాలనీ కూడా తెలుసుకున్నారు. ప్రజలు 1857 నాటి విప్లవానంతరం కొంత నిరుత్సాహపడినా, సక్రమమైన ఆందోళన సాగుతూ ఉండాలనికూడా గ్రహించారు. దీని ఫలితమే కాంగ్రెసుసృష్టి అని నా అభిప్రాయము. కొంతమంది ఆంగ్లమిత్రులు, కేవలం ధర్మబుద్ధితో కాంగ్రెస్ స్థాపనకి ప్రోత్సహించిన మాట సత్యమే కాని, మొత్తంమీద ఆంగ్ల రాజనీతిజ్ఞులు ఈ సక్రమాందోళనాసంస్థని అప్పట్లో ప్రోత్సహించడంలో కొంత స్వార్థంకూడా లేకపోలేదని నా నమ్మకం.

అప్పటికే, - అంటే కాంగ్రెస్సు ప్రారంభించిన కాలానికే - ఇంగ్లీషువారు దేశంలో నాణాల చట్టం ప్రవేశపెట్టి కరెన్సీనోట్ల చలామణీ ప్రారంభించారు. అప్పుడు బొంబాయిలోనూ, కలకత్తాలోనూ, ఇంకా ముఖ్యమైన వర్తకస్థానాలలోనూ చాలా తీవ్రమైన అలజడి బయలుదేరింది. అది ఆ వర్తకుల డబ్బుతోనూ పలుకుబడితోనూ కలిసి, చివరికి చినికి చినికి గాలివాన అవుతుందేమో నని మనదేశంలో వున్న ఆంగ్లరాజనీతి కోవిదులు కొంచెం భయపడి, ఈ ఆందోళనను సక్రమమైన కట్టు కాలవల్లో ప్రవహింప చెయ్యడానికి, ఈ కాంగెసు సంస్థని పురిగొల్పారని నా అభిప్రాయము.

అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధంనాటినించీ ఇంగ్లీషువారికి జయ పరంపరలే కాని, అపజయం అనేది లేదు. పరభూములు స్వాధీనం చేసుకున్నాక, గట్టి పద్ధతులమీద తీర్చిన సంస్థల సహాయంతో తమ ప్రయోజనాలు సాధించుకోవడంలో ఇంగ్లీషువాళ్ళు ఆరితేరినవాళ్ళు. అందుచేతనే వాళ్లు మొట్టమొదట మన రాజ్యాంగ సంస్థలని నిర్మూలింప