పుట:Naajeevitayatrat021599mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైకోర్టు జడ్జీ అయ్యాక నేను ఒకసారి ఆయన్ని కలుసుకోవడం తటస్థించింది. అప్పుడు ఆయన ప్రస్తావన తీసుకువచ్చి, "తన ఎదట ముద్దాయి తరపున కేసు సరిగా చెప్పని కారణంచేతనే చార్జీ చేశాను," అన్నాడు. ఎల్లాగ అయితేం శ్రీరాములు అందులోంచి నెమ్మదిగా బయటపడ్డాడు.

కార్లీలియన్ పత్రిక తరవాత అట్టేకాలం నడపలేదు. దాని పర్యవసానం ఏమయినా, పంతులుగారు చెప్పుడు మాటలు విని ఈ కేసు పెట్టినందుకు, ఆయన అంటే భక్తి గౌరవాలు ఉన్న నేను ఆయన్ని బోనులో నిలబెట్టి చాలా కష్టమైన ప్రశ్నలతో బాధించాను. అందుకు మాత్రం నా మనస్సు చాలా నొచ్చుకుంది. కాని, వృత్తి ధర్మంచేత అది తప్పనిసరి అయింది. శ్రీరాములు రాజమహేంద్రవరంలోనే న్యాయంగా వకీలు వృత్తి చేసుకుంటూ కాలక్షేపం చేస్తూవచ్చాడు.

20

కుటుంబ పరిస్థితులు

నారెండోతమ్ముడు జానకిరామయ్య మద్రాసులో నేను బారిష్టరు అయిన తరవాత యఫ్. ఏ. చదివి మెడికల్‌కాలేజీలో జేరాడు. మెడికల్‌కాలేజీలో రెండుసంవత్సరాలు చదివాక అతన్ని ఇంగ్లండు పంపాను. అక్కడ ఎడింబరోలో 5 సంవత్సరాలు యఫ్. ఆర్. సి. యస్. చదివి హౌస్ సర్జన్‌గా ఉంటూ ఉండేవాడు. ఆ తరవాత, మొదటి ఐరోపా మహాసంగ్రామంలో ఐ. యమ్. యస్. లో టెంపరరీ కమిషన్‌పొంది యుద్ధంలోచేరాడు. కాని, మెసపొటేమియా మొదలైనచోట్ల పనిచేసి అక్కడి సైనికాధికార్లతో తగాదాలుపడి తిరిగివచ్చి, మద్రాసు చేరుకుని అక్కడ ప్రాక్టీసు పెట్టాడు. మొత్తంమీద అక్కడ ప్రాక్టీసు బాగానే అందుకుంది. అల్లోపతీలో ఉత్తీర్ణుడు అయినా హోమోపతీ అంటే అతనికి ఎక్కువ నమ్మకము. అందులో అతను చాలా కృషిచేశాడు. ఇప్పటికీ అతనికి అది అంటేనే అభిమానము.