పుట:Naajeevitayatrat021599mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోనూ, అద్దెతోనూ రామచంద్రరావుగారికి సుమారు ఇరవైవేలు తిరిగి ఇచ్చి ఆ ఇల్లు పూర్తిగా నాపేర స్వాధీన పరుచుకున్నాను.

నా పెద్ద తమ్ముడు శ్రీరాములు చిన్నప్పటినించీ కొంచెం నెమ్మదైనవాడు. అతను ఒంగోలులో హైస్కూలు చదువు చదివాడు. అప్పుడు కొంచెం పేకాట దృష్టిలో పడి మెట్రిక్యులేషన్ రెండుసార్లు తప్పాడు. నేను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు పెట్టిన తరవాత రాజమహేంద్రవరం వచ్చాడు. అక్కడ యఫ్. ఏ. చదివి; మద్రాసులో క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ. చదివాడు. యఫ్. ఏ. దగ్గిరనించి చురుగ్గా చదివి డిగ్రీపొందిన తరవాత ఫస్టుగ్రేడు పాసయి రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చేశాడు. అతని అభిమాన విద్య వేదాంతం. క్రిస్టియన్ కాలేజీలో స్కిన్నర్‌వద్ద ఫిలాసఫీ చదువుకున్న రోజుల్లో అతను క్రైస్తవ సిద్ధాంతంలోకి మారాడు. అతను చదువుకున్న వేదాంతం కేవలం పుస్తకాలతో అంతం కానియ్యకుండా ఆచరణలో కూడా పెట్టేవాడు. కొంతకాలం నా దగ్గిరే ప్రాక్టీసు చేశాడు. తరవాత కొంతకాలం అత్తవారి ఊరు అయిన కాకినాడలో ప్రాక్టీసుచేసి, మళ్ళీ రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అతను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసుచేసే రోజుల్లో మంచి బుద్ధి సూక్ష్మతా, వాదనా శక్తీ చూపించాడు. కాని, కేసుల్లో ఏమాత్ర న్యాయమూ, సత్యమూ లేకపోయినా వాటిని నిరాకరించడంవల్ల అంతగా ప్రయోజకుడు కాలేకపోయాడు.

ఒకసారి నేను ఊళ్ళో లేనప్పుడు ఒక ప్రముఖుడైన క్లయంటు అతని దగ్గిరికి వచ్చి ఒక కేసులో సాక్షులు ఏమి చెప్పాలో కొంచెం ముందుగా చెప్పించమని అడిగాడు. వెంటనే అతను, "అది నా పనికాదు, నేను సాక్షుల్ని తయారుచేసే ప్లీడర్ని కాను," అన్నాడు. అదీ అతని తరహా! అతను సంఘ సంస్కా రాందోళన రోజుల్లో వీరేశలింగంగారి శిష్యుడు అయ్యాడు. ఆ రోజుల్లో ఆయనకి ముఖ్యులైన వాళ్ళలో ఒకడుగా ఉండేవాడు. కాని తరవాత ఆయనతో తగాదాలు పడిన వాళ్ళలో అగ్రగణ్యుడు అయ్యాడు!