పుట:Naajeevitayatrat021599mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమర్శించాను. న్యాయమూర్తులు కార్యనిర్వాహకవర్గంలోకి ప్రమోషన్ అయ్యే సిద్ధాంతం పరిపాలనకి లాయకు అయిన సంగతి కాదని నావాదన. సర్ అబ్దుల్ రహీముగారినిగురించి వ్రాసినప్పుడు కూడా నా వాదన అదే! ఆ వ్యాసం వ్రాశాక సర్ అబ్దుల్‌గారు తమ ఇంటికి నన్ను భోజనానికి పిలిచి, తమకి ఉన్న ఆదుర్దా అంతా నాతో చెప్పారు. నడచినన్నాళ్లు లాటైమ్సు మద్రాసులో జడ్జీలకి, ప్లీడర్లకీ కొరడాలాగ ఉండేది.

నా ప్రాక్టీసు హైకోర్టులోనే కాకుండా మన రాజధాని అంతా వ్యాపించి ఉండేది. విశాఖపట్టణం మొదలు తిరుచునాపల్లివరకూ అన్ని జిల్లాకోర్టుల్లోనూ హాజరు అయ్యాను. ఒకసారి తిరుచునాపల్లిలో ఒక సివిల్‌కేసులో మూడుమాసా లున్నాను. వేలకొద్దీ ఫీజు పుచ్చుకున్నాను. నేను డబ్బు సంపాదించిన రోజుల్లో ఫీజు చాలా హెచ్చుగానే పుచ్చుకునే వాణ్ణి. పాపం! పార్టీలు చాలామంది చాలా డబ్బు నా పేరుమీదుగా పోగొట్టుకున్నారు! చాలామంది పూర్తిగా నష్టపడి ఉంటారని కూడా అనుకుంటాను. కొన్ని కేసుల్లో రోజుకి అయిదువందలు, వెయ్యీ కూడా పుచ్చుకున్నాను. తిరుచునాపల్లిలో సంపాదించిన డబ్బుతోటి ఊటీలో కొన్న బంగాళాకి 'గోదావరి' అని పేరు పెట్టాను.

1919 లో రాజమహేంద్రవరంలో సత్యవోలు గున్నేశ్వర్రావు ప్రభృతులపైన వచ్చిన ఫోర్జరీ కర్రెన్సీనోట్ల కేసులో మొదటినించీ - అంటే కమిటల్ కోర్టు దగ్గరనించీ - నేనే ఉండి నడిపించాను. ఆ కేసులో నాకు సాంబమూర్తిగారు సహకారిగా పనిచేశారు. నిడదవోలు పార్టిషన్ కేసు, కృష్ణాజిల్లా జమీందారీకేసులు మొదలయిన డబ్బు పుష్కలంగా లభ్యంఅయ్యే కేసులు అన్నీ వచ్చాయి. పానగల్లురాజాగారు చిత్తూరు కోర్టులో కాళహస్తి జమీందారుగారిమీద తెచ్చిన సివిల్ లిటిగేషన్‌లో నేను చాలాకాలం పనిచేశాను. అందులో నాకు పి. వి. రమణారావుగారు సహకారిగా పనిచేశారు. ఇల్లాగ మంచి ప్రాక్టీసు బాగా రావడంవల్లనే పదిసంవత్సరాల్లో రెండుమూడులక్షల రూపాయలూ, మద్రాసులో ఒక ఇల్లూ, ఊటీలో ఒక బంగళా, ఒంగోలులోనూ, రాజమహేంద్రవరంలోనూ ఒక్కొక్క ఇల్లూ, ఇంకా రెండులక్షల రూపాయల విలవగల