పుట:Naajeevitayatrat021599mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, మరి పది, పదిహేను రోజులకి వి. కృష్ణస్వామయ్యరుగారు తమంతట తమరే ఈ కేసు పిలిపించారు. పిలిపించి, తాము ఇదివరలో పొరపాటు అభిప్రాయానికి వచ్చామనీ, అందుకోసం తిరిగి వినవలెననీ, అదిసవరించుకుంటున్నామనీ చెప్పి, నా కేసు అంతా విని నా కనుకూలమైన తీర్పు చెప్పారు. అది హైకోర్టు జడ్జీలలో సామాన్యం అయిన విషయం కాదు. పొరబాటు పడడం మానవ మాత్రులకి సహజమేకాని, అది పొరబాటని తెలిసిన తరవాత ఈరీతిగా సవరించుకోవడం అనేది అసాధారణ విషయం. అప్పుడే నేను లాటైమ్సులో ఆయన ఘనత ప్రశంసిస్తూ వ్రాశాను. కృష్ణస్వామయ్యరుగారు కోర్టులో దడదడ లాడించినా మనసులో కక్షవహించే తరహా మనిషికాదు. తరవాత, ఆయన ఎక్జిక్యూటివ్ కౌన్సిలర్ అయినప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళాను. ఆయన నన్నెంతో ఆదరించి, " Prakasamǃ Good friends do not carry any prejudices in their minds" అన్నాడు.

ఒకప్పుడు సర్ కె. శ్రీనివాసయ్యంగారు బెంచీమీద ఉండగా నా కొక పేచీ వచ్చింది. ఆయన గొప్ప మేధావి. సునిశితమైన బుద్ధి విశేషం కలవాడు. దానికితోడు కేసు తానే స్వయంగా అవగాహన చేసుకునివచ్చి ఒక అభిప్రాయంతో కూర్చునేవాడు. అల్లాంటప్పుడే సామాన్య లాయర్ల పని చాలా ఇరుకుని పడిపోతుంది. అయినా, కూట్సు ట్రాటరూ ఇద్దరూ ఉండగా నే నొక కేసు ఆర్గ్యుమెంటు చెబుతున్నాను. ఆయన మధ్య మధ్యని నాకు అడ్డుతగిలి అప్పుడే జడ్జిమెంటుకి వచ్చేసినట్లు సూచించాడు. అప్పుడు నేను, "అయ్యా ఈ కేసులో నేను మీ కోసం ఆర్గ్యుమెంటు చెప్పడంలేదు. మీరు అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చినట్లు తోస్తుంది. నేను ఇది అంతా రెండో జడ్జీగారికోసం చెబుతున్నాను," అన్నాను. దాంతో ఆయన మరి మాట్లాడలేదు.

పి. ఆర్. సుందరయ్యరుగారు జడ్జీగా ఉండేటప్పుడు ఆయనతో కూడా నాకు తగాదా వచ్చింది. సుందరయ్యరుగారు చాలా వివేకవంతుడు. చురుకైనవాడే కాని, తాను విచారించబోయే కేసు స్వయంగా