పుట:Naajeevitayatrat021599mbp.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేపియర్ అనే ఇంకొక బారిష్టరు జడ్జీగా ఉండేవాడు. ఆయనైతే చురుకైనవాడే కాని శాంతం తక్కువ. ఒక కేసులో ఆయన నన్ను 4 గంటలకి పిలిచారు. అది ఒక క్రిమినలు కేసు. నేపియరుగారు ఆ కేసు అంతా పదినిమిషాలలో ముగించాలన్నారు. నేను అది అల్లాగ ముగించడం సాధ్యం కాదనీ, ఆయన ఇచ్చిన టైములో కేసులోని ముఖ్యవిషయం చెప్పడానికైనా వీలుండదనీ చెప్పాను. ఆయనకి ఆగ్రహంవచ్చి, "చాలు! సోది కట్టిపెట్టండి!" అన్నాడు. వెంటనే నేను కాగితాలకట్ట బల్ల మీద కొట్టి, ఆయన అన్నమాట ఉపసంహరించుకుంటే కాని ఈ కోర్టులో ఆర్గ్యుమెంటు చెప్పడానికి నిరాకరిస్తున్నా నన్నాను. ఆయన ముఖం ఎర్రనై అక్కడనించి లేచిపోయాడు. అప్పటికి బారిష్టర్ల అసోసియేషన్ అని ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో ఆస్‌బర్ను, గ్రాంటు, నార్టన్, స్వామినాథన్ ప్రభృతులు నాకంటె సీనియర్లు ఎందరో ఉన్నా నన్ను అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. ఆ సంఘం నేపియర్ అగౌరవ చర్యని గురించి తీవ్రమైన అసమ్మతి తెలుపుతూ ఒక తీర్మానం పాసుచేసి పంపించింది. చివరికి ఆయన క్షమాపణ చెప్పాక కేసు నడిచింది.

వి. కృష్ణస్వామయ్యరుగారు జడ్జీగా ఉండినప్పుడు ఒకసారి నాకూ, ఆయనకీ కొంచెం పట్టింపు వచ్చింది. ఆయనా, జస్టిస్ వాలస్సూ బెంచిమీద ఉండగా నే నొక Batch దావాలో వాదించవలసివచ్చింది. మొదటనే కృష్ణస్వామయ్యరుగారు నా కేసు తోసివేశారు. అన్ని కేసుల్లోనూ దావా కారణం ఒకటైనా నేను ఎప్పటి కప్పుడే ఒక్కొక్క పాయింటుగా వాదిస్తూ వచ్చాను. కృష్ణస్వామయ్యరుగారు, "ఏమి ఇల్లా వాదిస్తున్నా?" రని అడిగారు. నేను, "తాము నేను, చెప్పే విషయం సరిగ్గా అవగాహన చేసుకోకముందే ఒక తీర్పుకి వచ్చారు. అవకాశం ఉంది కనక ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నా మాటలకి విలవ ఇస్తారేమో అనే ఆశకొద్దీ తంటాలు పడుతున్నాను," అన్నాను. ఆయన, "అది ప్రకాశంగారి పట్టుదలకి నిదర్శనం," అన్నారు. కేసు నాకు వ్యతిరేకంగా అయింది.