పుట:Naajeevitayatrat021599mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని పూర్వాచార పరాయణులైన నా బంధువులకీ, స్నేహితులకీ కూడా నచ్చజెప్పగలిగాను. కాని, రెండోసారి ఇంగ్లండు వెళ్ళినప్పుడు ఆ ఆచారం ఐచ్చికంగానే సడలించాను. అందుచేతనే అక్కడ ఒక్క చేపలకి సంబంధించిన వంటకాలే నా ఎదట పెట్టారు. అవి 124 రకాలు ఉన్నాయి. నేను జర్మన్ యూనివర్సిటిల్లో ముఖ్యంగా సైన్సు లేబరేటరీలు చూడా లని అనుకున్నాను. కాని నాకు అనుమతి దొరక లేదు. నేను విద్యార్థిననీ, కేవలం చూడాలనే ఆకాంక్ష గలవాణ్ణి మాత్రమే అనీ చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగలేదు. చివరికి లండన్ టెలిగ్రాము యిచ్చి నా సంగతి కనుక్కుని అ తరవాతే నాకు అనుజ్ఞ యిచ్చారు.

16

బారిష్టరు వృత్తి

నేను మద్రాసులో బారిష్టరు వృత్తి ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రాక్టీసు బాగా అందుకుంది. 10 సంవత్సరాలు కింద కోర్టుల్లో ప్రాక్టీసు చేసి ఉండడంవల్లనూ, దేశంలో చాలామంది పరిచితులూ, అభిమానులూ ఉండడంచేతనూ ప్రాక్టీసు దినదినాభివృద్ధి పొందింది. 1907 వ సంవత్సరంలో నేను మద్రాసులో ప్రవేశించి 14 సంవత్సరాలూ - అంటే 1921 వ సంవత్సరంలో ప్రాక్టీసు మానివేసేవరకూ - ఏకటాకీగా ప్రాక్టీసు చేశాను. ప్రపంచక దృష్టితో చూస్తే నా జీవితంలో ఈ 14 సంవత్సరాలూ అన్నివిధాలా భోగభాగ్యాలతో కూడిన కాలము. ఈ కాలంలో సంగతులు వ్రాయడానికి దీన్ని రెండు భాగాలుగా విభజిస్తాను. మొదటి 7 సంవత్సరాలలోనూ కొత్తచోట ప్రవేశించడమూ, పదిమంది స్నేహితులూ వద్దు అన్నా, మద్రాసులో హేమా హేమీల మధ్య చేరి పడిపోకుండా క్రమంగా నిర్జించుకు రావడమూ తలచుకుంటే, నాకు బ్రహ్మాండమైన విషయాల్లాగ కనబడతాయి. తరవాత 7 సంవత్సరాల్లోనూ నాకే