పుట:Naajeevitayatrat021599mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభిమాన విషయమైన తొట్టి వైద్యాన్నిగురించి వివిధమైన చర్చలు సాగించి సంగతులు అన్నీ తెలుసుకున్నాను. ఆయన ముఖవర్చస్సు పరీక్షించి మనిషి మానసిక తత్వాన్ని తెలియచేసే వా డని వాడుక. నేనుకూడా దానికి రెండు సావరనులు యిచ్చాను. ఆయన నా నెత్తిని చెయ్య్యిపెట్టి ఏమో చెప్పాడు. కాని నాకు భాష రాకపోవడంచేత అది ఏమీ తెలియలేదు. రెండు పౌనులు మాత్ర ఊడాయి.

జర్మనీలో మొదటివారం అయ్యేసరికి నాకు పోలీసుల దగ్గిరనించి నోటీసు వచ్చింది. విదేశీయులు ఆ దేశంలో వారం రోజుల కంటె ఎక్కువ ఉంటే పోలీసు వాళ్ళకి రిపోర్టు చేసుకుని వాళ్ళ అనుమతి పొందాలి. అ ప్రకారంగా నేను అనుమతి పొందాను. ఈ రోజున ప్రపంచా న్నంతటినీ సంక్షోభపరుస్తూన్న జర్మనీనిగురించి నాకు కలిగిన మొదటి అభిప్రాయం వ్రాస్తాను. జర్మనీ శుద్ధ మిలిటరీదేశం. మిలిటరీ అధికారులకి అక్కడ జరిగే గౌరవం అపారం. ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా పెద్ద మిలిటరీ అధికారులు వస్తూంటే, వారిదగ్గిర వుండే డంకాలు మోగిస్తూ వుండేవారు. ఆ డంకా బజాయించేసరికి బాటలమీద నడిచే జనం అంతా పక్కకి ఒత్తిగిలి వాళ్ళకి దారి యివ్వవలసిందే. "భూ గర్భంలో మిలిటరీ కోర్టులు ఉన్నాయనీ, ఒకసారి వాటిలోకి వెడితే వెళ్ళినవాడు మళ్ళీ వస్తాడో, రాడో సందేహం!" అనీ భయంకరంగా చెప్పుకుంటూ ఉండేవారు. ఎంత మిలిటరీ అధికారం ఉన్నా, ప్రజలలో సుహృద్భావం చాలా హెచ్చు. వాళ్ళు ఇతర దేశీయులు - అందులోనూ భాష తెలియనివాళ్ళు - అంటే ఎక్కువ ఆదరమూ, మర్యాదా చూపిస్తారు. నేను రెండుసార్లు దారి తప్పితే నన్ను సరియైన చోటికి తీసుకువెళ్ళి దిగవిడిచారు.

అప్పటికి యూరపులో ఉండే అన్ని జాతులవాళ్ళకన్నా జర్మనులు మంచి భోజనప్రియులు. వారి హోటళ్ళు మంచిదర్జాగా ఉండేవి. ఇంగ్లీషు హోటల్లోలాగ కాకుండా లెఖ్ఖపెట్టడానికి వీలులేనన్ని వంటకాలు ఉండేవి. నేను మొదటిసారి ఇంగ్లండులో ఉన్నప్పుడు శుద్ధ శాకహారిగా ఉండి, ఇంగ్లండులో కూడా శాకాహారజీవనము సాధ్యం