పుట:Naajeevitayatrat021599mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

యూరపు సంచారం

నేను మిత్రుల సహాయం పొంది యూరపులో సంచారం చేశాను. రాకపోకల్లో పారిస్ ఇదివరకే చూశాను. ఇంక హాలండు, డెన్మార్కు, స్విట్జర్లండు, స్వీడన్, ఇటలీ, గ్రీసు, జర్మనీదేశాలు ఆఖరున చుట్ట పెట్టాను. డెన్మార్కు వ్యవసాయపు దేశం. అక్కడి వ్యవసాయపు పద్ధతులు చాలా ఆకర్షకంగా ఉంటాయి. స్విట్జర్లాండ్‌లో అప్పుడు ముఖ్యమైన పరిశ్రమ లన్నీ గృహపరిశ్రమలు గానే నడపబడుతూ ఉండేవి. నేను ఇటలీలో విసూవియస్ పొంగుతూ ఉన్నప్పుడు చూశాను. ఇంకా నేపుల్సు, పై సాటరు మొదలయిన అపురూపపు ప్రదేశా లన్నీ చూశాను. థెర్మాపోలిఫ్ కనుమ కూడా చూశాను. ఇవన్నీ చూసిన తరవాత జర్మనీ వెళ్ళాను. ఈనాడు ప్రపంచ చరిత్రలో ప్రముఖస్థానం అలంకరించిన జర్మనీనిగురించి కొంచెం వ్రాస్తాను. మిగిలిన దేశాల్లో రెండురోజులో, మూడురోజులో మాత్రమే ఉన్నాను. కాని జర్మనీలో 15 రోజులున్నాను.

బారిష్టరు చదువుకి పోవడానికి ముందే నాకు లూయీఖూన్ తొట్టి వైద్యంలో నమ్మకం కుదిరింది. ఆ వైద్యం అలవాటు చేసుకున్నాను. ఆ ఖూన్‌ని స్వయంగా చూడా లని కూడా నాకు అభిలాష. అందుచేత జర్మనీ వెడుతూనే ఆయన ఉంటూన్న లిప్‌జిగ్ వెళ్ళాను. అప్పుడు నాదగ్గిర ఒక చిన్న చేతిపెట్టి మాత్రం ఉంది. రైలు దిగడంతోటే ఒక మనిషి నా పెట్టి పట్టుకుని చక్కాపోవడం ప్రారంబించాడు. వాడికి నా భాష అర్థం కాదు. అందుచేత చివరికి నా భాష తెలిసే మనిషి దొరికేవరకూ వాడి వెనకాల పడి పోవలసివచ్చింది. నేను లిప్‌జిగ్‌లో ఖూన్ యింట్లోనే మొదట మకాం చేశాను. అప్పటికి ఆయన ఆస్పత్రి ఏదో కారణంచేత కట్టివేశారు. ఇంట్లోనే వైద్యం చేస్తూ ఉన్నాడాయన. ఆయనతోపాటే నాకూ కొన్ని ఉడక వేసిన కాయగూరలు ఫలహారం పెట్టాడు. తరవాత నేను సెయింట్ పీటర్సుబర్గ్ అనే పెద్ద హోటల్లో మకాంచేసి, రెండురోజులు ఆయనదగ్గిర ఉండి, నాకు