పుట:Naajeevitayatrat021599mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంజిత్‌సింగ్ వారసుడూ అయిన దులీప్‌సింగ్ తరపున పంజాబు తిరిగి ఆయనకి ఇచ్చివెయ్యాలని గవర్నమెంటుమీద దావా వేశాడు. అది ఒక పెద్దకేసు. లార్డు రీడింగు హిందూదేశంలో ఆచార వ్యవహారాలు, వాటికి సంబంధించిన కేసులు మొదలైనవి ఏరి చెప్పడానికి ఎవరైనా ఒక భారతీయుడు తనకి సాయం కావాలని షెప్పర్డు నడిగాడు. ఆయన నన్ను అప్పగించాడు. నేను కొంతకాలం ఆ రూఫస్ ఆఫీసులో పనిచేశాను. ఆ కేసు కొంతకాలం జరిగింది. చివరికి కేవలం శాస్త్రీయ కారణాలచేత అది ఆక్టు ఆఫ్ స్టేటు కనక కేసు లేదని కొట్టివేశారు. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ సర్ రాబర్ట్ ఫిన్‌లేగారు హాజరై కేసు నడిపించారు.

సామాన్యంగా అనుకునేటట్టు బారెట్లా ఫైనల్‌పరీక్ష అంత సుళువైన విషయంకాదు. ఇంగ్లండుకి సంబంధించిన ఆస్తిపాస్తుల చట్టాలు, సివిల్ క్రిమినల్ ప్రొసీజరు, ఈక్విటీ కోర్టులకి సంబంధించిన చట్టాలు కలిపి, చాలా పెద్ద గ్రంథం ఉండేది. మన ఉన్నత విద్యలాగే మన లాయర్లకి పనికి వచ్చేది కాని, హిందూదేశానికి సంబంధించినది గాని ఏమీ ఉండేదికాదు. లాకి సంబంధించిన వరకు ఈ బారిష్టరు పరీక్షే చాలా పెద్దపరీక్ష. ప్రీవీ కౌన్సిలులో ప్రాక్టీసు చెయ్యడానికికూడా, ఇదే అర్హత. జడ్జీలకి కూడా ఇదే అర్హత. ఏది ఎల్లా ఉన్నా, హిందూ దేశస్థులకి ఈ చదువు చాలా ఖర్చుతో కూడుకున్న పని.

ఆ రోజుల్లో బారిష్టరు పరీక్షకి చదవడానికి ఏమి డిగ్రీలు అక్కర లేదు. ప్రవేశపరీక్ష అని ఒకటి ఉండేది. అందులో తృప్తికరంగా పాసయితే చేర్చుకునేవారు. బాగా ఇంగ్లీషు రానివాళ్ళు కూడా చేరి ట్యూటర్ల సహాయంతో గట్టెక్కేవారు. కాని, హిందూదేశపు చట్టాల సంగతీ, వాటి అనుభవమూ లేనివాళ్ళకి ఈ చదువు అంతా ఊకదంపులా కనిపిస్తుంది. కాని నాకూ, అప్పట్లో నా సహాధ్యాయి అయిన సర్ యస్. యన్. సర్కారుగారికీ హిందూదేశంలో లాతో అనుభవం ఉండడంవల్ల, అది అంతా చాలా సరదాగా ఉండేది. ఆయన ఇక్కడ బి. ఎల్. పాసయి, జిల్లా మునసబుపని చేస్తూ బారిష్టరుగా వచ్చారు.