పుట:Naajeevitayatrat021599mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు ఉపన్యాసాలివ్వడమూ, కొంద రాయన్ని అడ్డుప్రశ్నలు వెయ్యడమూ, మరికొంద రాయన చెప్పినదానికి హర్షించడమూ జరిగింది. సి. ఆర్. రెడ్డిగారు ఎం. ఏ. కీ, బారిష్టరు పరీక్షకీ కూడా తయారు అయ్యారు. చివరిదాకా డిన్నర్లు వగైరాలకు హాజరై పరీక్షకి మాత్రం హాజరు కాకుండా ఊరుకున్నారు. నేను ఆయన్ని కలుసుగున్నప్పుడు తెనుగు భారతం చదువుతున్నారు. నాకు తెనుగు భారతంమీద చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు. నేను "డిన్నర్లు అయ్యాయి కదా! బారిష్టరు పరీక్షకి హాజరై పరీక్ష ఎందుకు పూర్తి చెయ్య,"రని అడిగాను. ఆయన "గోఖలేగారు నాకు బారిష్టరు పనికి వెళ్ళవద్దని సలహాయిచ్చారు. పరీక్ష పాసై ఉంటే ఎప్పటికి అయినా ప్రాక్టీసు చెయ్యాలి అని చపలత్వం కలుగుతుంది. కాబట్టి, ఒక్కసారేదానికి తిలోదకాలు ఇచ్చాను" అన్నారు. అంత దీక్షతో ఉన్నారు ఆయనప్పుడు!

నేను ఈ కాలంలో ఇంగ్లీషు కోర్టులలో పని చాలా శ్రద్దగా గమనించాను. అప్పుడే రెండుమూడు గొప్ప కేసులుకూడా వచ్చాయి. ఒక కేసులో సర్ ఎడ్వర్డు కార్సన్ అనే ఐరిషు బారిష్టరు పనిచేశాడు. ఒక ఇంగ్లీషు యువతి ఒక జర్మన్ రాజకుమారుడిమీద తనని పెళ్ళి చేసుకుంటానని మభ్యపరచి దగా చేశాడని, వాగ్దాన భంగాని (Breach of promise) కి కేసు తెచ్చింది. ఆ కేసులో జడ్జీకూడా మొదటినించీ ఆమె పట్లనే అభిమానం చూపిస్తూ వచ్చాడు. ఆ సంగతి సర్ ఎడ్వర్డు కార్సన్ గ్రహించి కేసు మంచి నేర్పుతో నడిపించాడు. క్రాసు పరీక్షలో చాలా అమాయికంగా కనిపించే ప్రశ్నలు తగిలించి, వాటి ఆధారంతో ఆమె చాలా మాయల మారి అనీ, ఎందరో ధనవంతులికి టోపీ వేసే సమర్థురాలనీ వాదించాడు. జ్యూరీకి ఆర్గ్యుమెంటు చెపుతూ గుండె బెదురులేకుండా, "జడ్జీలు ముందుగా తమబుద్ధి కోర్టు బయట వదిలిపెట్టి వచ్చినా సాగుతుంది, కాని జ్యూరర్లు మాత్రం వివిధమైన అభిమాన దురభిమానాలూ ఉంచుకోకుండా తమ వివేకాన్ని ఉపయోగించ,"మని ఉపోద్ఘాతం చెప్పాడు. చివరకి ఆ కేసులో జ్యూరీ రెండు భాగాలు అవడంచేత కేసుపోయింది.