పుట:Naajeevitayatrat021599mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీవాళ్ళు డాక్టర్ స్వామినాధన్‌ని తీసుకువచ్చి కేసు నడిపిస్తున్నారు. నేను తిరిగి వచ్చాక అ కేసులో స్వామినాధన్‌కి వ్యతిరేకంగా పనిచేసి కొట్టివేయించాను. తరవాత అది సివిల్‌కేసుగా పరిణమించింది. నేను ఆ కేసులో ప్లెయింటు దాఖలుచేసి మళ్ళీ ఇంగ్లండు వెళ్ళిపోయాను. ఆ కేసు 5, 6, సంవత్సరాలపాటు కిందుమీదులు పడి చివరికి ఆమె పక్షం అయింది. మొట్టమొదట ఆమెదగ్గిర కేసు ఖర్చులికి కూడా డబ్బు లేకుండా ఉన్న రోజుల్లో నేను ఆ కేసు పట్టి పనిచేశాను. ఆ ఆస్తి సుమారు పది లక్షల రూపాయల విలువగలది. ఆస్తి ఆమె స్వాధీనం అయ్యాక ఆమె నాకు 70 వేల రూపాయల ఫీజు ఒక్కసారిగా ఇచ్చింది.

13

మళ్ళీ ఇంగ్లండు ప్రయాణం

రెండవటెరము చదువుకి మళ్ళీ అక్టోబరులో బయలుదేరి లండన్ వెళ్ళాను. లండన్‌లో కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పించే ఉపన్యాసాలు శ్రద్ధగా ఆలకిస్తూ ఫైనలు పరీక్షకి తయారు అయ్యాను. అన్ని ఇన్‌లలోనూ ఈ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఉపన్యాసాలిప్పిస్తూ అందరికీ పరీక్షలు జరిపి పట్టాలిస్తారు. అంతకి పూర్వం మన దేశంలో వాలస్ పట్టాల్లాగే డిన్నర్‌లకి క్రమంగా హాజరయిన బుద్ధిమంతులకి పట్టాలు ఇచ్చేవాళ్ళు. ఈ కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఏర్పడ్డాకే మనదేశంలో లా కాలేజీలు కూడా ఏర్పడ్డాయి.

ఈ కాలంలో నేను ఇంగ్లండు దేశం చాలా తిరిగాను. కాస్త వీలైనప్పు డల్లా ఒక్కొక్కదేశం ట్రిప్పు కొడుతూ ఉండేవాణ్ణి. ఇంగ్లండులో ఉన్న ముఖ్యపట్టణాలు, పరిశ్రమల స్థానాలు అన్నీ చుట్టుముట్టాను. అప్పుడే కేంబ్రిడ్జిలో సి. ఆర్. రెడ్డిగారిని కలుసుకున్నాను. ఆయన అప్పటికే చాలా తెలివైనవాడని పేరుపడ్డారు. యూనివర్సిటీలో కూడా ఆయన ప్రతిభ గణనీయంగా ఉంది. అప్పటి కప్పుడే గోఖలే