పుట:Naajeevitayatrat021599mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమ్మనీ నా కొక తాఖీదు ఇచ్చారు. దానికి వెంటనే నేను జవాబు ఇచ్చాను. గత 25 సంవత్సరాలనించీ ఆయన్ని ఎప్పుడూ మేము ఎరగమనీ, మా పెద్దలు అయినా ఆయన అధికారాన్ని ఎప్పుడూ అంగీకరించలేదనీ, నా కల్లాంటి తాఖీదు ఇవ్వడానికి ఆయనకి అధికారం లేదనీ వ్రాసి పంపించాను. అ బహిష్కారపు గందరగోళం ఒక పెద్ద ఆందోళనకి కారణం అయింది. నేను మళ్ళీ అక్టోబరునెలలో లండన్ వెళ్ళిపోయాక సుబ్బారావుపంతులు ప్రభృతుల ప్రోత్సాహంవల్ల స్వాములవారు రాజమహేంద్రవరం వచ్చారు. ఆయన్ని ఏనుగుమీద ఊరేగించి మార్కండేయస్వామి గుడిలో ఒక పెద్ద సభ చేశారు.

ఆ సభలో నా విషయమూ, నాతో విందు ఆరగించినవారి విషయమూ తీర్పు చెయ్యడానికి ఉపక్రమిస్తూ ఉండగా, కొండేపూడి భద్రిరాజు ప్రభృతులు లోపలికి వెళ్ళి స్వాములవారిని అడ్డుప్రశ్నలు వెయ్యడం లంకించుకున్నారు. "స్వామీ! తమ రెన్నడూ రాజమహేంద్రవరం రాలేదే! ఇప్పుడు తమర్ని ఎవరు రమ్మన్నారు? ఏమిటి సమాచారం? ఈ వ్యవహారమంతా ఏమిటి?" అని ప్రశ్నలు వేస్తూ ఆయన గౌరవార్థం వెలిగించిన దీపాలు ఊదివెయ్యడం ఆరంభించారు. దాంతో స్వాములవారు కంగారుపడి పావుకోళ్ళు చేత్తో పట్టుకుని, "బ్రతుకు జీవుడా!" అని పలాయనం చిత్తగించారు. ఈ విషయం అంతా వివేకవర్థనిలో ప్రచురించబడింది. నేను లండన్‌లో ఉండగా వీరేశలింగంగారు నాకు ఈ పేపరు కటింగు పంపించారు.

నేను జూలై, అక్టోబరు నెలలకి మధ్య రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రాక్టీసు చేశాను. ముఖ్యంగా పోతునూరు కేసు నాకు పూర్తిగా పని చెప్పింది. పోతునూరులో చెలసాని పట్టాభిరామయ్యగారి భార్య రామమ్మగారిమీద (మాగంటి బాపినీడు అక్కగారు), దాయాదులు ఆస్తి జబర్‌దస్తీగా స్వాధీనపరుచుకున్నారని నేరం మోపి క్రిమినల్ ప్రొసీజరుకోడు 145 సెక్షను ప్రకారం చార్జీ ఇచ్చారు. నేను ఇంగ్లండు వెళ్ళబోయే టప్పటికి అ కేసు ఆరంభం అయింది. అది నేను తిరిగి వచ్చేవరకూ నడుస్తూనే ఉంది. అవతల