పుట:Naajeevitayatrat021599mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకసారి ఆయనా, నేనూ లండనులో భోజనం చేస్తూండగా ఆయన షాంపేన్ ఆర్డరిచ్చాడు. నేను కేవలం కాయగూరలు తినడం, సారా తాగకపోవడం చూసి, ఆశ్చర్యపోయి, "ఇల్లాగైతే డిన్నర్ల దగ్గర మీరు పనికిరా రన్నమాటే!" అన్నారు. నా యీ కాయగూరల తిండి చాలామందికి ఆశ్చర్యంగా ఉండేది. ఇంగ్లీషు సహపాఠులు కొందరు నన్ను గడ్డితిని బ్రతికేవాడని హేళన చేస్తూఉండేవారు. అప్పటి కింకా ఈ విటమిన్ సిద్ధాంతం అమలులోకి రాలేదు. నేను విందుల్లో ఇంగ్లీషువాళ్ళ పంక్తికి బొత్తిగా పనికిరాకుండా ఉన్నానని, అన్నిటికన్నా తక్కువ ప్రమాదకరమైన సిగరెట్టు అలవాటు చేసుకున్న్నాను. దీనికి కూడా ఒక గాథ జరిగింది.

బారు విందులు జరిగినప్పుడు అందరిలోనూ చిన్నవాడైన విద్యార్థి భోజనానంతరం ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి, పొగ తాగడానికి మాష్టరు అనుజ్ఞ పొందాలి. ఇది అనుశ్రుతంగా వచ్చే ఒకతంతు. అంతవరకూ దాన్ని ఎవ్వరూ ధిక్కరించలేదు. నేనుమొదట్లో అక్కడికి వెళ్ళిన రోజుల్లో నా వంతు వచ్చింది. మా ఇన్‌కి అధ్యక్షుడు - మాష్టరు సర్ ఆర్థర్ కాలిన్సు. ఈయన మద్రాసు హైకోర్టు మొదటి ఛీఫ్ జడ్జిగా ఉండి చాలా స్వాతంత్ర్యం చూపించిన ప్రముఖుడు. ఆయన మద్రాసు హైకోర్టు నూతన భవనాలు తెరుస్తూ చాలాగంభీరంగా ఉపన్యసించి, "మతాలు, కులాలూ, ధనికులూ, పేదలూ అనే తారతమ్యం లేకుండా నేనూ, నా సోదర న్యాయాధిపతులూ న్యాయం చేస్తాము," అని చెప్పిన ధీరుడు. ఆయన ఈ ఇన్‌కి మాష్టరుగా ఉండడం చేతనే చాలామంది మద్రాసీయులు ఈ ఇన్‌లో చేరుతూ ఉండేవారు. నావంతు వచ్చేసరికి నేను నిలబడి, "సిగరెట్టు తాగి ఇల్లాంటి ఉపన్యాసం ఇవ్వను," అని చెప్పాను.

విందులో పాల్గొన్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. "ఇన్నాళ్ళ నించీ వున్న ఆచారం ధిక్కరించడమా?" అని హాహాకారాలు బయలుదేరాయి. నా బల్ల దగ్గిర ఉన్నవాళ్ళు కొందరు నన్ను తిట్టారు. కాని,