పుట:Naajeevitayatrat021599mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూసి అందులో నవ నాడులూ బంధించే షరతులు నా కిష్టం లేక, అది నాకు అక్కరలేదని చెప్పాను. కృష్ణవర్మ దేశభక్తి అపారము. తరవాత ఇండియా స్కాలర్‌షిప్ అనే పేరుతో సావర్కారు, వి. పి. యన్. అయ్యరు, మదన్‌లాల్ ఢింగ్రా ప్రభృతులకి ఆశ్రయమిచ్చినదీయనే. ఆయన ఇంగ్లండులో ఉండడానికి వీలు లేకపోవడంవల్ల ఫ్రాంసులో వుంటూ ఇటీవలనే చనిపోయాడు.

11

బారిష్టరు చదువు పూర్తి

ఈ రీతిగా భారత స్వాతంత్ర్యం కోసం పాటుబడే మనుష్యులతోటీ, సంస్థలతోటీ నాకు సాహచర్యం కుదిరింది. కాని, ఈ పనులేవీ నా బారిష్టరు చదువుకి ప్రతిబంధకం అవదు. రోమన్ లా, కాన్‌స్టిట్యూషన్ లా, లా హిష్టరీ వగైరా విషయాల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతూ ఉండేవి. నేను వాటి అన్నింటిలోనూ బాగానే ఉత్తీర్ణుణ్ణి అవుతూ వచ్చాను. అ కాలంలోనే సర్ శంకరన్ నాయరుగారు బారిష్టరు చదువుకోసం వచ్చి, మా గ్రే ఇన్‌లోనే చేరారు.

శంకరన్ నాయరుగారు అప్పటికప్పుడే రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెసు అధ్యక్షులు అయ్యారు. అక్కడనించి మద్రాసు గవర్నమెంటు ప్లీడరు, పబ్లిక్ ప్రోసిక్యూటరు కూడా అయ్యారు. కాని, హైకోర్టు జడ్జీ కావాలని ఆయన ఆశ. కేవలం వకీలుగా ఉంటే మైలాపూరు మేధావులతో పోటీవల్ల ఆ పదవి రాదని ఆయన భయం. హైకోర్టులో విధిగా కొంతమంది బారిష్టరు జడ్జీలు వుండాలి కనక, అల్లాగయినా హైకోర్టు జడ్జీ కావాలనే ఉద్దేశంతో వేసవి సెలవలలో వచ్చి డిన్నర్లకి హాజరు అవుతూ వుండేవారు. చివరికి, ఆయన బారిష్టరు కోర్సు పూర్తి కాకుండానే జడ్జీ అయ్యారు.