పుట:Naajeevitayatrat021599mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనిపించడంలో ఆశ్చర్యం ఏమి వుంది! పూర్తిగా బ్రిటిష్‌పాలనలో పడిపోయి, స్వీయమైన నాగరకత గుంటపెట్టి గంటవాయించి, కొత్త నాగరకతకి వరవళ్ళు దిద్దుతూ వుండే ఈ దేశంలో నించి వెళ్ళిన నన్ను, చక్కటి సురక్షితమైన పాశ్చాత్య నాగరకత ఆకర్షించడం ఒక వింతకాదు. మార్సెల్సులో దిగేసరికి ఓడ దగ్గిరా, రైలు దగ్గిరా పోర్టరు దగ్గిరనించి పై వుద్యోగస్థుడివరకూ, అందరూ చూపే శిక్షణా, మర్యాదా నన్ను బాగా సంతోష పెట్టాయి. హోటళ్ళలో స్త్రీ పురుషుల నడవడీ వాళ్ళ మర్యాదలూ కూడా బేష్ అనిపించాయి. అన్నిటికన్నా వాళ్ళు అనుభవించే స్వాతంత్ర్య వాయువులు నా కెంతో ఆనందం కలిగించాయి. పాశ్చాత్య పద్ధతులమీద ఆలోచనలు పారే ఆ రోజుల్లో "ఎప్పటికైనా మనదేశం ఈ వున్నత స్థితికివచ్చి, ఈ జాతులతో తులతూగుతుందా!" అని అనిపించింది.

లండన్‌లో చెంగల్రాయన్ నాయుడుగారు నివసిస్తూ వున్న చెస్ వాటర్ చేరుకున్నాము. మొదటిరోజున ఆయనతోపాటే ఒక గృహస్థు ఇంట్లో వున్నాను. రెండో రోజున ఆ నాయుడుగారు నన్ను ఆ పక్కని వున్న ఇంట్లో బసకి, భోజనానికీ కుదిర్చారు. ఆ దేశంలో సామాన్య గృహస్థులు కొంచెం డబ్బు తీసుకుని అతిథులికి ఆశ్రయం ఇస్తారు. అల్లాచేస్తే ఆ దేశపు సాంఘిక జీవనంలో తప్పు లేదు. నెలకి రెండు పౌనులు ఇచ్చే పద్ధతిమీద నేను బస, భోజనమూ కుదుర్చుకున్నాను. ఒక పెద్ద ష్టవ్ కొనుక్కొని ఒకగదిలో ప్రత్యేకంగా కాయగూరలు పప్పులుపచనం చేసుకుని భోజనంచేస్తూ వుండేవాణ్ణి. చెంగల్రాయన్‌గారు గ్రే ఇన్‌లో మెంబరుగా వుండి, బారెట్లాకి చదువుతూ వుండేవారు. ఆయన నన్ను కూడా ఆ ఇన్‌లోనే చేర్చారు.

ఈ సందర్భంలో ఈ బారిష్టరీ చదువుని గురించి కొంచెం వ్రాస్తాను. ఆ సమయంలో మన దేశంనించి, ముఖ్యంగా వంగ దేశంనించి ఎందరో యువకులు ఈ చదువుకోసం వచ్చేవారు. విశేషంగా చదువుకోసం శ్రమపడకుండానే డిన్నర్‌లకి హాజరై, పరీక్షలకాలంలో ముఖ్యమైన విషయాలు పరీక్షల ఏజంట్లద్వారా సంపాదించి, ముక్కుని పెట్టుకుని బారిష్టర్లయి మనదేశానికి తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో చాలా