పుట:Naajeevitayatrat021599mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారికి మత్స్య మాంసాదుల విషయమై మాట ఇవ్వడంచేత, రెండు బస్తాల బత్తాయి కాయలు కూడా ఓడలో వేయించాను.

నాతోబాటు చెంగల్రావునాయుడుగారు అనే ఒకాయన ప్రయాణం అయ్యారు. ఆయన రంగూన్‌లో ఎక్కౌంటెంటుగా వుండి, బాగా డబ్బు సంపాదించి, అ తరవాత బారిష్టరు చదువు ప్రారంభించారు. నాతో ప్రయాణం చెయ్యడానికి ముందు అప్పుడే ఆయన ఒకసారి లండన్ వెళ్ళి ఒక టెరమ్ పూర్తిచేసుకుని వచ్చారు. అది కారణంగా అక్కడి వ్యవహారాలన్నీ పూర్తిగా ఆకళించుకున్నవా రవడంచేత నాకు మంచి సహాయంగా ఉండేవారు. ఓడ ఎక్కిన మర్నాడే నాకు సముద్రపు జబ్బు (సీ సిక్ నెస్) వచ్చింది. మొదటి రోజున డైనింగు హాలులోకి వెళ్లేసరికి ఓడలో మాంసాదులు వండుతూన్న వాసన భరించలేక పోవడంవల్ల నాకు వాంతి చేసుకునేటంత పని అయింది. వెంటనే నా గదిలోకిపోయి సర్దుకున్నాను. రెండు రోజులవరకూ ఆ జబ్బుతోనే పడుకున్నాను. క్రమంగా అయిదు రోజులకి ఏడెన్ చేరుకున్నాము. మరి మూడు రోజులకి పోర్టుసెడ్ చేరాము. ఈ రేవుల్లో కనబడే జనం అంతా అరబ్బులు. వాళ్ళు సామాన్యంగా నల్లచర్మంవాళ్లే. మొత్తంమీద 12 రోజులు ప్రయాణంచేసి మార్సెల్సు చేరాను.

మార్సెల్సు చేరేసరికి నావలో ఉండే ప్రయాణీకుల వ్యవహారం అంతా మారిపోయింది. నాతోపాటు ప్రయాణం చేస్తూన్న వాళ్ళలో ఈ దేశంలో పెద్దపెద్ద వుద్యోగాలలో వుండి, నవాబ్‌దర్బారీ సాగిస్తూ వుండేవాళ్ళు చాలామంది వున్నారు. మధ్యధరా సముద్రం దాటేవరకూ ఈ వుద్యోగస్థుల దర్బారీ, ఠీవీ యథారీతిగానేవున్నాయి. కాని, మార్సెల్సు రేవులో దిగడంతోనే ఎవరి సామాన్లు వారు జాగ్రత్త పెట్టుకుని బుజాన వేసుకుని మిగిలిన సామాన్య జనంలాగే దిగడం ప్రారంభించారు. అల్లాగ లండన్‌కేసి వెళ్ళిన కొద్దీ వాళ్ళధోరణి మారిపోయింది.

పాశ్చాత్య ప్రపంచాన్ని గురించి మొట్టమొదటి చూపులో నాకు కలిగిన అభిప్రాయాలు కొంచెం వివరిస్తాను. ఆకాలానికే పాశ్చాత్య నాగరకతా వాసనలతో నిండిన నాకు, ఆ ప్రపంచం తెల్లవాడి మాయగా