పుట:Naajeevitayatrat021599mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లాండునించి వచ్చాక ఆయన భార్య ఆయనతో కాపరం చెయ్యడానికి నిరాకరించింది. ఆయన రాజమహేంద్రవరంలో ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని పెళ్ళాడి చాలా నిర్భాగ్య జీవితం గడుపుతూ ఉండేవాడు.

మా వాళ్ళకి బారిష్టరు అంటే అదే అభిప్రాయం. కష్టాలు పడి, పడి నామీదే ఆశలన్నీ కేంద్రీకరింపచేసుకున్న మాఅమ్మగారికి నా భవిష్యత్తుని గురించి భయం కలిగింది. అందుచేత ఆవిడికి లండన్‌ప్రయాణం అంటే కొంచెం జంకు పుట్టింది. నేను ఆవిడికి ఆ విషయమై భయం ఉండనవసరం లేదనీ, బారిష్టరు చదువంతా రెండుమూడు టెరముల్లో పూర్తిచేస్తాననీ, మత్స్య మాంసాలు ముట్టుకోననీ చెప్పి శపధంచేసి, ఎల్లాగో అల్లాగ చిట్టచివరికి ఒప్పించాను. ఆవిడ సహజంగా ధైర్యస్థురాలు. కనక అతికష్టంమీద అంగీకరించింది. ఆ తరవాత నా భార్యని కూడా ఒప్పించి, ఆవిణ్ణి గుంటూరుజిల్లా కొత్తపట్నంలో ఆవిడ పినతల్లిగారింట్లో - అంటే మా చిన్నక్కయ్యగారింట్లో - దిగబెట్టాను. మా అమ్మగారిని మా తమ్ముడు శ్రీరాములు దగ్గిర ఉంచి ఇంగ్లండుకి ప్రయాణం అయ్యాను.

ఈ రీతిగా సంసారపు సర్దుబాట్లన్నీ చేసుకుని అక్టోబరు మొదటి వారంలో లండన్ వెళ్ళడానికి నిశ్చయించాను. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ - అంటే స్టీమరు బుక్కింగు వగైరాలన్నీ - డాక్టర్ స్వామినాథన్ గారి ద్వారా చేశాను. మునిసిపల్ ఛైర్మన్‌పని శ్రీ పి. నారాయణరావుగారికి డెలిగేటుచేశాను. ముందు మద్రాసువచ్చి అక్కడ రెండురోజులున్నాను. రెంటాల వెంకట సుబ్బారావుగారు నా ప్రయత్నం మెచ్చుకుని స్వయంగా నాకు కావలసినవన్నీ ఏర్పాటుచేశారు. ఆవకాయ వగైరా ఊరగాయలన్నీ చక్కగా మూటలు కట్టించి ఇచ్చారు. అక్కడ నించి బొంబాయివెళ్ళి బొంబాయిలో నా క్లయింట్లూ, శ్రీమంతులూ అయిన గొల్లపూడి చిన నరసింహంగారి ఇంట్లో రెండురోజు లుండి, మెయిల్ బోట్‌మీద ఇంగ్లండుకి ప్రయాణం అయ్యాను. మా అమ్మ