పుట:Naa Kalam - Naa Galam.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మరి, ఇప్పుడో? చూస్తూనే వున్నాముగా!

మే 25వ తేదీన ఢిల్లీ చేరుకున్నాను. ప్రధాని నివాస భవనానికి వెళ్లగానే ఆమె స్పెషల్‌ అసిస్టెంట్‌ శ్రీ ఆర్‌.కె. ధావన్‌ స్వాగతించి, లోపల ప్రముఖు లెవరో వున్నారని, కొంచెం సేపు కూర్చోవలసిందిగా కోరాడు. శ్రీ ధావన్‌ సమర్ధుడైన ఆంతరంగిక కార్యదర్శి. అప్పటిలో ప్రధాని ఇందిరా గాంధి తరఫున యావద్భారతంలో చక్రం తిప్పేవాడు. ధావన్‌ దగ్గర నుంచి ఫోన్‌ వచ్చిందంటే చాలు, రాజకీయులకు కొందరికి పండుగ, అధికారంలో వున్న వారికి గుండె దడ! అలా అధికారాన్ని వెలగపెట్టాడు ధావన్‌. ఆయన మొదట ఇందిరాగాంధి ఏషియాడ్‌ నిర్వాహక కమిటి అధ్యక్షురాలుగా వున్నప్పుడు ఆమెకు స్టెనో గ్రాఫర్‌! తరువాత ఆమెకు స్పెషల్‌ అసిస్టెంట్‌! ఆ తరువాత రాజీవ్‌గాంధి ప్రధానిగా వున్నప్పుడు కేంద్రమంత్రి. కేంద్రంలోకానివ్వండి, రాష్ట్రాలలో కానివ్వండి. అప్పుడైనా, ఇప్పుడైనా చక్రం తిప్పేది వారి ప్రయివేట్‌ సెక్రటరీలే!

ఇంతలో ప్రధాని దగ్గర నుంచి కాలింగ్‌ బెల్‌ మోగింది. శ్రీ ధావన్‌ వెంటనే నన్ను ప్రధాని చాంబర్‌లోకి తీసుకువెళ్లి, "మిస్టర్‌ కుటుంబరావ్‌!" అంటూ నన్ను పరిచయం చేశారు. బహుశా నా లేఖలను బట్టి ఆమె వూహాపథంలో చిత్రించుకున్నట్టులేనేమో, ప్రధాని నన్ను కూర్చోమనలేదు! ముందున్న రౌండ్‌ టేబుల్‌ ప్రక్కనే నేను నిలబడి వున్నాను. సహజ సిద్ధమైన పాత్రికేయ ఆత్మ గౌరవం పొటమరించగా, ఆమె చెప్పకుండనే నేను నా ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాను! ఆమె నా వంక తేరిపార చూచారు! "చెప్పండి!" అన్నట్టు సంజ్ఞ చేశారు.

సహజంగా శ్రీమతి గాంధి గంభీరమూర్తి. రాజకీయులు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడ్డానికి వెనుకంజ వేసేవారు. నేను ఆమె "మూడ్‌" మార్చాలని భీమవరంలో శ్రీ రాజీవ్‌గాంధి ఉపన్యాసాన్ని నేను అనువదిస్తున్నప్పటి ఫొటో