పుట:Naa Kalam - Naa Galam.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వహించిన నెహ్రూ కుటుంబం పట్ల ఎందరో వలెనే నాకు కూడా అత్యంత ఆసక్తి, గౌరవం.

కాగా, 1982లో శ్రీ ఎన్‌.టి. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి నప్పుడు ఆ తరువాతి సంవత్సరంలో జరిగే జనరల్‌ ఎన్నికలలో కాంగ్రెసుపై టి.డి.పి. ప్రభావం ఎలా వుంటుందన్న విషయంలో రాష్ట్ర మంతటా ఎక్కడ ఇద్దరు కలుసుకున్నా చర్చలు జరుగుతున్నాయి. అప్పటిలో కొందరు మిత్రులు "ఇందిరా గాంధితో మీరు సన్నిహితంగా వుంటారు కదా! మీ లేఖలన్నింటికి ఆమె ప్రతి స్పందిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని గురించి మీరైతే ఆమెకు యథార్థ చిత్రాన్ని చూపిస్తారు. మీరు ఆమెను కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిని గురించి ఎందుకు వివరించకూడదు?" అని ప్రశ్నించేవారు.

నిజమే! శ్రీమతి ఇందిరాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాల రీత్యా నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో శ్రీమతి ఇందిరాగాంధికి, ఆయనకు ఏవో కొన్ని సమస్యలపై విభేదాలు ఏర్పడినవని అప్పుడప్పుడు తెలుగు పత్రికలలో కథనాలు వెలువడుతూ వుండేవి. వాటిని నేను ఆమె దృష్టికి తీసుకురాగానే, మూడవనాటి కల్లా "అలాంటి విభేదాలు లే"వని ఆమె నుంచి పత్రికలలో ఖండన వచ్చేది! ఆ రీత్యాను, ఆంధ్ర ప్రాంతానికి ఆమె రాజకీయ ఉపన్యాసాలకు వచ్చినప్పుడు ఆమెకు అనువాదకుడుగాను నేను సన్నిహితుణ్ణి అయ్యాను.

నా మిత్రుల సలహా నాకు నచ్చింది. 1982 మే నెలలో ప్రధాని ఇందిరాగాంధీతో ఇంటర్‌వ్యూ కోరుతూ ఆమెకు లేఖ రాశాను. మే 25వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలుసుకొనడానికి రావలసిందిగా నాకు వారం, పది రోజులలో జవాబు వచ్చింది! అప్పటి ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మంత్రుల వ్యవహారశైలి అలా వుండేది!