పుట:Naa Kalam - Naa Galam.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆయన నాపట్ల వాత్సల్యభావంతోనే వున్నారు.

"ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గురించి మీ అభిప్రాయమేమిటి?" అని అడిగాను.

"నెహ్రూ ఇస్తున్నాడుగా! ఇంకా నా అభిప్రాయమెందుకు?" అన్నారు. ఈ సారి ఆయన కంఠధ్వనిలో కొంత విరుపు కనిపించింది! మరి, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నది కదా!

నేను సెలవు తీసుకుని వస్తూ వుంటే, "యు విల్‌ కమ్‌ అప్‌ ఇన్‌ లైఫ్‌" అన్న మాటలు వినిపించాయి. నేను వెనుదిరిగి, ఆయన వద్దకు వెళ్లి "ధాంక్యూ, సార్‌!" అని వచ్చి వేశాను.

ప్రకాశంపై రాజాజీ వ్యాఖ్య

ఆ తరువాత చాలా కాలానికి 1972లో "ఆంధ్రకేసరి" శతజయంతి సందర్భంగా నేను రాసిన "ఆంధ్రకేసరి జీవితంలో కొన్ని అద్భుత ఘట్టాలు" అన్న పుస్తకంపై రాజాజీ అభిప్రాయాన్ని కోరగా, "ప్రకాశం సింహ హృదయుడైన దేశభక్తుడు. మనం కోల్పోయిన మహామహులలో ఆయన ఒకరు. "ఆంధ్రకేసరి" అన్న బిరుదుకు ఆయన అక్షరాలా తగినవారు" అని రాశారు.

అలనాటి నాయకుల హుందాతనం, ఉదాత్తత అలాంటివి. వారిలో వ్యక్తిగత ద్వేషాలు వుండేవి కావు. అభిప్రాయ భేదాలు, సిద్ధాంత వైరుధ్యాలు, కార్యాచరణలో వైవిధ్యాలు మాత్రమే కానవచ్చేవి.

"నేను అస్తమిస్తున్న సూర్యుడిని నాకెందుకు పదవులు?"

డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తెలుగువారిలో మహా మేధావి. ఆయన జ్ఞాపకశక్తి అసాధారణమైనది. అంతటి జ్ఞాపకశక్తివున్న వారు మరెవరు? నేను ఇప్పటికీ జ్ఞాపకశక్తిలో ఆయనకు దీటు ఎవరా? అని అన్వేషిస్తూనే