పుట:Naa Kalam - Naa Galam.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆయన సాధారణ రాజకీయవేత్తకాడు. మహారాజ నీతిజ్ఞుడు. 1937-39లో మొదటిసారి మద్రాసు ముఖ్యమంత్రి. 1948 జూన్‌లో ఇండియా గవర్నర్‌ - జనరల్‌ అయిన ప్రథమ భారతీయుడు. అంతకు పూర్వం సర్‌ సత్యేంద్ర ప్రసన్న సిన్హా కొద్ది కాలంపాటు తాత్కాలిక గవర్నర్‌ జనరల్‌గా పనిచేశారు. అది 1914 ప్రాంతం. రాజాజీ ఇండియాకు ఆఖరి గవర్నర్‌ - జనరల్‌ కూడ. ఆ తరువాత 1950 జనవరిలో భారతదేశం సర్వతంత్ర స్వతంత్ర ప్రజాస్వామిక రిపబ్లిక్‌ అయింది. రిపబ్లిక్‌కు అధ్యక్షుడు వుంటాడు. రాజాజీతో గవర్నర్‌ - జనరల్‌ పదవి రద్దు అయింది.

రాజాజీ కుమార్తె లక్ష్మిని గాంధీజీ కుమారుడు దేవదాస్‌ గాంధి వివాహం చేసుకున్నాడు గాంధీజీ, రాజాజీ వియ్యంకులైనారు.

1952-1953లో రాజాజీ ముఖ్యమంత్రిగా వుండగా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని, నాగార్జున, పులి చింతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను, ఆయన విధానాలను నా పత్రిక "ప్రతిభ"లో అంతకంటె తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాదాపు ప్రతి సంచికలోను ఒక వ్యాసం రాసేవాడిని - తీవ్రపదజాలంతో.

"ప్రతిభ" నుంచి నేను టంగుటూరి ప్రకాశం గారి "ప్రజాపత్రిక" దినపత్రికకు సహాయ సంపాదకుడుగా వెళ్లాను కదా! అప్పుడొకసారి నేను రాజాజీని ఇంటర్‌వ్యూ చేయడానికి వెళ్లాను. నేను "ప్రతిభ" లో రాసిన తెలుగు వ్యాసాల అనువాదాలు ఆయన దృష్టికి వెళ్లాయి! అందువల్ల, నా పేరు ఆయనకు బాగా గుర్తు. నేను వెళ్లగానే ఆయన చిరునవ్వుతో కూర్చోమన్నారు. అప్పటికి నా వయస్సు 21 సంవత్సరాలు.

"మీరు తెలుగుపత్రికలో రాసిన వ్యాసాలన్ని చూశాను. చాలా బాగున్నాయి" అన్నారు చిరునవ్వుతో. ఆయన మహామేధావి. ఆయనతో