పుట:Naa Kalam - Naa Galam.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నప్పుడు ప్రఖ్యాత నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర జీవిత వజ్రోత్సవం మద్రాసులో అత్యంత వైభంగా జరిగింది. ఆ మహోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ ఎస్‌. నిజలింగప్ప - పాల్గొన్నారు.

Naa Kalam - Naa Galam Page 53 Image 0001
Naa Kalam - Naa Galam Page 53 Image 0001

కాగా, శ్రీ అక్కినేని నట జీవితానికి పునాదులు పరిచిన కృష్ణాజిల్లాలో, ముఖ్యంగా తెలుగు సినీ రాజధాని విజయవాడలో ఆయన నట జీవిత వజ్రోత్సవం జరపాలన్న ఆలోచన ఆ నగరంలోని తెలుగు సినీ పరిశ్రమకు వచ్చింది. తెలుగు చలనచిత్ర నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులు ఆ ప్రాంతం నుంచే వెళ్లాలి. మద్రాసులో నిర్మించే తెలుగు చిత్రాలను పంపిణీ చేసే ముఖ్యమైన డిస్ట్రిబ్యూటింగ్‌ సంస్థలకు కేంద్రం విజయవాడే. అక్కినేని స్వస్థలం వెంకట రాఘవాపురం విజయవాడకు దాదాపు 30 మైళ్ల దూరం.

అందువల్ల, విజయవాడలో వజ్రోత్సవం జరపడానికి సన్నాహ సంఘం ఏర్పాటుకు చిత్రరంగ ప్రముఖులు, నగర పెద్దలు సమావేశమైనారు. అప్పటికి - 1957 నాటికి - నా వయస్సు 24 సంవత్సరాలు. అయినా, అప్పటికే నేను పత్రికా సంపాదకుణ్ణి కావడం వల్ల నన్ను కూడా ఆహ్వానించారు. అక్కినేనికి సన్మానంలో భాగంగా గజారోహణ, పురవీథులలో ఊరేగింపు మొదలైన సూచనలు వచ్చాయి. వాటిని అందరూ అంగీకరించారు.