పుట:Naa Kalam - Naa Galam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షలో....

1952 అక్టోబర్‌ 19న శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని ఆయన దీక్ష లక్ష్యం. రోజులు గడచి పోతున్నాయి. ఎందరు నాయకులు ఎన్ని విధాల చెప్పినా, ఆయన దీక్ష విరమించడం లేదు. ప్రధాని నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని స్పష్టంగా హామీ ఇచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని ఆయన పట్టుదల. నిరాహారదీక్ష 50వ రోజు వచ్చింది. ఆయన బాగా నీరసించి పోయారు. ఇక జీవించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు.

అది డిసెంబరు 7వ తేదీ. శ్రీరాములు గారి నిరాహార దీక్ష 50 వ రోజు. ఆయన చేత దీక్ష విరమింపజేయడానికి మద్రాసులో అఖిలపక్ష ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ సభకు నేను కూడా ఒక పత్రికా సంపాదకుడుగా హాజరైనాను. సభ మద్రాసు మౌంట్‌రోడ్‌లోని కర్లపాటి అప్పారావు గారి భవన ప్రాంగణంలో జరిగింది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషి కార్‌ లోక్‌ పార్టీల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ రోజున జోరున వర్షం. సభ కోసం వేసిన షామియానాలు తడిసిపోయాయి. కింద కూర్చున్న మా పైన వర్షపు నీళ్లు పడుతున్నాయి. తడవ కుండా మేము వెంట తీసుకువెళ్లిన వార్తాపత్రికలను తలపై పెట్టుకున్నాము. కాని, అవి ఏమి ఆగుతాయి? సభకు "ఆంధ్రకేసరి" ప్రకాశం గారు అధ్యక్షులు. మద్రాసు నగరంతో కూడిన ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని ఆయన పట్టుదల. అలా అయితే, కేంద్రం ఆంధ్రరాష్ట్రాన్ని ఇవ్వదని, రాష్ట్రం వస్తే కాని శ్రీరాములు గారు దీక్ష విరమించరని, అందువల్ల మద్రాసు నగరం లేకుండా ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని మనం కేంద్రాన్ని కోరాలని కమ్యూనిస్టుల వాదం. ఈ సమస్యపై ఓటింగ్‌ తీసుకోవాలని కమ్యూనిస్టేతర