పుట:Naa Kalam - Naa Galam.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెహ్రూ" శ్రీ సంజీవరెడ్డి పట్ల ఆగ్రహంతో ఆయన వీపు పై ఒక్క చరుపు చరిచారు! అది నేను స్వయంగా చూశాను! ఇదంతా నేను కూడా జీపు వెంట కొంచెం దూరంగా పరుగెత్తుతూనే చూశాను! ఆ జన సముద్రంలో రిక్షాలు ఎక్కడ వుంటాయి? అప్పటికి నాకు కూడా 18, 19 సంవత్సరాలు!

నెహ్రూతో

పండిట్‌ నెహ్రూ రైలు స్టేషన్‌కు చేరుకున్న కొద్ది సేపటికే నేను కూడా చేరుకున్నాను - రిక్షాలో. అక్కడ పండిట్‌ నెహ్రూతోపాటు చాలా మంది ప్రముఖులు, కేంద్ర ఆహారశాఖ ఉపమంత్రి, ఆ తరువాత వింధ్యప్రదేశ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అయిన శ్రీ మొసలికంటి తిరుమలరావు వున్నారు. శ్రీ తిరుమలరావు నాకు కొంచెం తెలుసు. నన్ను ప్రధాని నెహ్రూకు పరిచయం చేయవలసిందిగా కోరాను. ఇప్పటివలె అప్పుడు భద్రతా పోలీసుల కట్టడి వుండేది కాదు. సాక్షాత్తు దేశ ప్రధానిని సయితం సులభంగా కలుసుకునే అవకాశం వుండేది!

"ఇతను తుర్లపాటి కుటుంబరావు అనే యువ పాత్రికేయుడు" అని శ్రీ తిరుమలరావు నన్ను ప్రధానికి పరిచయం చేశారు.

"రాష్ట్ర రాజకీయాలను గురించి మీకు వివరించడానికి ఢిల్లీకి వస్తానని, నాకు ఇంటర్‌వ్యూ ఇవ్వాలని మీకు లేఖ రాశాను" అని నేను కొంచెం బెరుకుగానే, అయినా, ధైర్యాన్ని చిక్కపట్టుకుని అన్నాను. ఔను, మరి! ఆయన ఈ మహా దేశానికి ప్రథమ ప్రధాని. చరిత్ర పుటలలోకి ఎక్కిన మహోన్నత నాయకుడు. నేను ఇంకా నూనూగుమీసాల యువ జర్నలిస్టును. అయినా, జర్నలిస్టునన్న ధీమా కల్పించే గుండె నిబ్బరంతో ఆయనతో నేను ముందు మాట్లాడాను.

"ఆ లేఖకు నేనేమి జవాబు రాశాను?" అని ఆయన తన మృదు, గంభీర కంఠంతో ప్రశ్నించారు.