పుట:Naa Kalam - Naa Galam.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇష్టం లేదు! అందువల్ల, అంతవరకు ఒక విధానంతో నడిచిన పత్రికను మూసివేయవలసిన సమయం వచ్చినట్టు కనిపించింది.

అప్పుడే శ్రీ కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌, శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు కలిసి "ఆంధ్రజ్యోతి" దినపత్రికను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నన్ను ఆ పత్రికలోకి సహాయ సంపాదకుడుగా పంపాలని డాక్టర్‌గారి వుద్దేశం. "రోగి కోరిందే వైద్యుడూ పెట్టమన్నాడు" అన్నట్టుగా, నా కోర్కె కూడా అదే. ఎందువల్లనంటే, "ఆంధ్రజ్యోతి" ఎడిటర్‌ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన నా పాత్రికేయ జీవితానికి గురుద్రోణాచార్యుడు. నా దృష్టిలో తెలుగులో ఆయనవలె సంపాదకీయాలు రాయగలిగిన వారు, రాయగలవారు ఆయనకు ముందు కాని, ఆయన తరువాత కాని ఎవ్వరూలేరు. ఆ పదాల పొందిక, ఆ వాక్య నిర్మాణ చాతుర్యం, ఆ విభిన్న విజ్ఞాన విభవం అనితరసాధ్యం. అట్టి పాత్రికేయ ద్రోణాచార్యుని వద్ద పనిచేసే అవకాశం కంటె నా వంటి ఏకలవ్య శిష్యుడు కోరేది ఏముంటుంది?

అప్పటి లెజిస్లేటిన్‌ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ శ్రీ జి.ఎస్‌. రాజు గారు "ఆంధ్రజ్యోతి"ని ప్రచురించే ఆంధ్ర ప్రింటర్స్‌ లిమిటెడ్ లో డైరెక్టర్‌. శ్రీ రాజు గారు నాకు కూడా పరిచితులే. ఆయన అంతకు పూర్వం జరిగిన నా వివాహానికి వచ్చి, నన్ను ఆశీర్వదించారు. ఆయన విజయవాడలో "సిరీస్‌" అనే ప్రఖ్యాత ఔషధోత్పత్తి సంస్థ అధినేత. సంస్కార సంపన్నులు. ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. నాకు అడుగడుగునా అండ.

ఆయన ఆంధ్ర ప్రింటర్స్‌ చైర్మన్‌ కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌ గారికి నన్ను గురించి చెప్పారు. వారు వెంటనే వచ్చి పత్రికలో చేరవలసిందిగా సూచించారు. ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు, నేను 1960 మే 21వ తేదీన "ఆంధ్రజ్యోతి"లో చేరాను. ఎడిటర్‌ నార్ల గారికి నా వచన రచనా రీతి నచ్చింది. నేను అంతకు