పుట:Naa Kalam - Naa Galam.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధోరణి కనిపెట్టారు! ఈ రైలు ప్రయాణమే ఆ తరువాత మా ఇద్దరి జీవితాలలో పెద్ద మలుపు!

కలకత్తాలో మాకు "సురతీర్థ" అనే నృత్యకళాశాలలో బస ఏర్పాటుచేశారు. 1959 జనవరి 25వ తేదీ రాత్రి ఆంధ్ర అసోసియేషన్‌ వారు ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. మొదట ప్రఖ్యాత "సితార" వాద్యనిపుణుడు రవిశంకర్‌ కచేరీ, తరువాత ప్రసిద్ధ నృత్యకళాకారుడు ఉదయశంకర్‌ నాట్యం, చివరగా కృష్ణకుమారి కూచిపూడి నృత్యం. ఆమె నృత్యానికి మధ్య మధ్య నా వ్యాఖ్యానం. అది ఆంధ్ర అసోసియేషన్‌ సభ కాబట్టి, ప్రేక్షకులందరూ తెలుగు వారే కాబట్టి, ఆ మూడు కార్యక్రమాలను వీక్షించి ఆనందించారు.

ఉపేంద్ర పౌరోహిత్యం

ఆ మరునాడు - జనవరి 26 ఉదయం - కిడ్డర్‌పూర్‌ ఆంధ్ర అసోసియేషన్‌లో నాకు, ఆమెకూ సన్మానం. సభాధ్యక్షుడు ఆ తరువాత చాలా కాలానికి కేంద్రమంత్రి అయిన శ్రీ పర్వతనేని ఉపేంద్ర. ఆయన మాట్లాడుతూ "కుటుంబరావు, కృష్ణకుమారి వివాహం చేసుకుంటే, నృత్యం, సాహిత్యం ఒకే ఇంటిలో నర్తిస్తాయి" అన్నారు. ఆయనకు జర్నలిజంలో డిప్లమా వుంది. రైల్వేల పత్రికకు ఆయన ఎడిటర్‌. అప్పటికి నాలో ప్రతిస్పందన ఏమీలేదు. శ్రీ ఉపేంద్ర మాటకు ఉలిక్కిపడి, మర్యాదకోసం నవ్వి వూరుకున్నాను. ఆమె నా ప్రతి స్పందన ఎలా వుంటుందోనని నా వంక చూచింది!

ఆ సాయంత్రం "సురతీర్ధ"లో ఒంటరిగా వున్న నా వద్దకు ఆమె వచ్చి "ఉదయం ఉపేంద్రగారు అన్నమాటలపై మీ అభిప్రాయం ఏమిటి?" అని ఒక్కసారిగా, సూటిగా అడిగే సరికి నాకు నోట మాట రాలేదు! అప్పటికి నా వయస్సు 27 ఏళ్లు. అప్పటికి 23 మంది అమ్మాయిలను పెద్దల సమక్షంలో