పుట:Naa Kalam - Naa Galam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తుందా అని నేను ఎదురు చూచేవాడిని; నా వ్యాసం ఎప్పుడు చదువుదామా అని చాలా మంది పాఠకులు నిరీక్షించేవారని సాక్షాత్తు ఆ పత్రిక సహాయ సంపాదకుడు శ్రీ గోరా శాస్త్రి నాతో ఆ తరువాత స్వయంగా చెప్పారు.

నా పేరు ఫలానా అని శ్రీ రామారాయ్‌తో చెప్పేసరికి అంతకు పూర్వం "తెలుగు స్వతంత్ర"లో నా వ్యాసాలు చాలా చదివి వున్నందున, ఆయన తన పత్రికకు ఎడిటర్‌గా పనిచేయాలని కోరారు. నేను వెంటనే అంగీకరించాను. అప్పటిలో నేను పని చేసిన పత్రికలన్నింటిలో కూడా అలా ఆ పత్రికల స్థాపకులు నన్ను ఎక్కడో చూడ్డం, నన్ను తమ పత్రికలోకి సంపాదకుడుగా పని చేయాలని కోరడం జరుగుతూ వచ్చింది. అలా అప్పటికి "వాహిని", "ప్రతిభ"లలో నాకు అవకాశం వచ్చింది.

"బోయ్ ఎడిటర్‌"

"ప్రతిభ"లో ఎడిటర్‌గా చేరేటప్పటికి నా వయస్సు 19 సంవత్సరాలు; అప్పటికి నేను జర్నలిజంలోకి వచ్చి, అయిదు సంవత్సరాలు. అందువల్ల, నన్ను "బోయ్ ఎడిటర్‌" (బాల సంపాదకుడు) అనే వారు. "ప్రతిభ"లోవున్నది సంవత్సరమే. అప్పటిలో ఇప్పటి ఆంధ్రప్రాంత జిల్లాలు మద్రాసు రాష్ట్రంలో వుండేవి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ (శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి).

ఆయన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకి. ఆంధ్రులు కోరుతున్న నందికొండ (నాగార్జున) ప్రాజెక్టుకు వ్యతిరేకి. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరిగితే, ఆంధ్రులు, తమిళుల మధ్య రక్తపాతం జరుగుతుందని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల మంత్రికి ఆయన రహస్యలేఖ రాసినట్టు ప్రతీతి. అంతేకాక, నందికొండ ప్రాజెక్టును కాదని, తమిళులకు వుపకరించే కృష్ణా - పెన్నార్‌ ప్రాజెక్టుకు ఆయన అనుకూలుడు.