పుట:Naa Kalam - Naa Galam.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విజయవాడలో కొంచెంసేపు ఆగారు. అంతకు పూర్వం గాంధీజీ విజయవాడ నాలుగు సార్లు వచ్చినా, ఆయనను సందర్శించడానికి నాకు అవకాశమే లేదు. అప్పటికి నేను జన్మించలేదు. నేను ఉంటున్న గన్నవరంలోని కొందరు పెద్దలు గాంధీజీ సందర్శనార్థం విజయవాడ వెడుతుంటే, వారితో పాటు నేను కూడా వెళ్లాను.

మహాత్ముడు ప్రయాణిస్తున్న రైలు విజయవాడలో కొద్దిసేపే ఆగింది.

Naa Kalam - Naa Galam Page 126 Image 0002

ఆ రైలును చూడగానే జనసందోహం "మహాత్మా గాంధికి జై" అంటూ దిక్కులు పిక్కటిల్లేట్టు నినాదాలు చేశారు. ఆ నినాదాలకు గాంధీజీ బోసినోటితో చిరునవ్వులు కురిపిస్తూ రైలు దిగి అక్కడవున్న ఆసనంలో కూర్చున్నారు. చాలామంది ఆయన ఆటోగ్రాఫ్‌ల కోసం విరగదొక్కుకోసాగారు. ఆ తొక్కిసలాటను చూచి, గాంధీజీ "తప్పు!" అన్నట్టుగా ముక్కుపై వేలు వేసుకున్నారు. ఎక్కడివారక్కడ గప్‌ చుప్‌! అక్కడ ప్రశాంత నిశ్శబ్ద గంభీర వాతావరణం !

సోమవారం గాంధీజీకి మౌనవ్రతం. అందువల్లనేకాబోలు, ఆయన ఆ రోజు మాట్లాలేదు. కాని, ఆటోగ్రాఫ్‌లు కోరిన వారి నుంచి అయిదేసి రూపాయలు తీసుకుని గాంధీజీ సంతకాలు చేస్తున్నారు. అందరినీ తోసుకుని, నేను కూడా ముందుకు వెళ్లి జాతి పితకు నమస్కరించి, ఆటోగ్రాఫ్‌ కోరగా, ఆయన అయిదురూపాయలు ఏవీ అన్నట్టు, నావంక ప్రశ్నార్థకంగా చూశారు.

అయిదు రూపాయలా ? అవి అప్పటిలో నావంటి వారికి లభించడం గగనం! నేను అయిదురూపాయలు లేవని దీనవదనంతో, ఆత్రంగా ఆయనకు నమస్కరించాను. ఆయన చిరునవ్వుతో నాకు ఆటోగ్రాఫ్‌ యిచ్చారు! ఎంత మహద్భాగ్యం!