పుట:Naa Kalam - Naa Galam.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్న మూడు నెలలలో నన్ను శాసన మండలికి నామినేట్‌ చేయించాలన్న ఆలోచన వచ్చింది కాని, అది కూడా కార్యరూపం ధరించలేదు. 1983లో తెలుగు దేశం ప్రభుత్వం రావడంతో అది శాసన మండలికే స్వస్తి చెప్పదలచింది.

అటు పిమ్మట 2004లో డాక్టర్ రాజ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో శాసన మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు ఆయన నాకు తెలియకుండనే శాసన మండలికి నన్ను జర్నలిస్టుల తరపున నామినేట్‌ చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆయన ప్రెస్‌ సెక్రెటరీ ద్వారా నాకు తెలియవచ్చింది. ఆ నిర్ణయం జరిగి నప్పుడు నేను తీవ్రమైన వ్యాధితో హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఉన్నాను. 1985లో శ్రీ ఎన్‌.టి. రామారావు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత రద్దయిన శాసనమండలి రాజశేఖర రెడ్డి - రోశయ్యల పుణ్యమా అని పునరుద్ధరించబడింది.

ఈ సారి కూడా ఢిల్లీలో కాంగ్రెసు అధిష్ఠానం ఆమోదానికి వెళ్లిన 12 మంది గవర్నర్‌ నామినీల పేర్లలో నా పేరు ప్రముఖంగానే ఉన్నది. కాంగ్రెసు అధిష్ఠానం ఆమోదం పొంది వచ్చిన తరువాత 2007 మార్చి 29వ తేదీ రాత్రి నా పేరుతో సహా 12 పేర్లను రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది! ఆమరునాడు ఉదయం ఆ జాబితా గవర్నర్‌ సంతకానికి వెళ్ళడమే తరువాయి. ఆ రాత్రి 9,10 గంటల మధ్య ఢిల్లీలో రాజకీయ చదరంగంలో "పావులు" చకచకా కదిలాయి ! ఈ సారి శ్రీ పి.వి.నరసింహారావు లేరు కాని, ఆయన కుమారునికి నాకు దక్కవలసిన స్థానం లభించింది. 1978లో మొదటి సారి "బస్సు తప్పినప్పుడు" నేను కొంచెం వ్యాకులత చెందకపోలేదు. అయితే, ఈ మూడవ సారి కూడా "బస్సు తప్పిపోయినప్పుడు" నేను చిద్విలాసంగానే దాన్ని తీసుకున్నాను. ఎందువల్లనంటే, అది కూడా ఒక "యోగ"మని మొదటిసారి "బస్సు" తప్పినప్పుడు తెలిసి వచ్చింది. ఒకప్పుడు యోగ్యత ఉన్నా, యోగం