పుట:Naa Kalam - Naa Galam.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అయితే, కొన్ని స్వయం నిర్ణీత సంప్రదాయాలకు లోబడి ఆయా వ్యక్తులను గురించి రాస్తూవుంటాను. ఈ సందర్భంగానా పై ఒత్తిడి వచ్చినా, నేను దాన్ని పరిగణించను.

1960లో ఆవిర్భవించినప్పటికంటె ఇప్పుడు "వార్తలలోని వ్యక్తి" రూపురేఖలు మారిపోయాయి. ఔను ! ఇప్పుడు "వార్తలలోని వ్యక్తి" వయస్సు అర్థశతాబ్ది దాటింది! మరి, పరిణత వయస్సు వచ్చింది కదా! అప్పుడది ఆయా వ్యక్తుల పరిచయాల శీర్షిక మాత్రమే! ఇప్పుడో? అదొక రాజకీయ వ్యాఖ్యగా పరిణతి చెందింది. ఆ శీర్షిక అభిమానులలో సామాన్యుల దగ్గరి నుంచి అసామాన్యులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికార ప్రముఖులు, ఐ.ఏ.ఎస్‌. అధికారులు ఉన్నారు. నాకు తెలిసి, చాలా మందికి తెలియని కొత్త విశేషాన్ని ఆ శీర్షిక చెప్పడమే దాని ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పవలెనంటే, నాకు "పద్మశ్రీ" అవార్డు రావడానికి కూడా ఆ శీర్షిక చేసిన దోహదం లేక పోలేదు. రాష్ట్రపతి "పద్మశ్రీ" అవార్డు ప్రదానం సమయంలో నాకు ప్రసాదించిన ప్రశంసా పత్రంలో ఆశీర్షిక పేరు లేక పోయినా, పరోక్షంగా దాని ప్రస్తావన ఉండడమే ఆ శీర్షిక విశిష్టతకు నిదర్శనం !

తెలుగు భాషతో నా తాదాత్మ్యం

నా పాత్రికేయ జీవిత ప్రారంభమే తెలుగు భాష, తెలుగు రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతలతో ఆరంభమైనది. ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు, నా తొలి వ్యాసం "స్వరాజ్యంలో స్వరాష్ట్రం". ముక్కోటి ఆంధ్రులు ఒక్క రాష్ట్రంలో ఉంటే, తెలుగు జాతికి, తెలుగు భాషకు జవం, జీవం వికసించగలవని నా విశ్వాసం. అప్పటి నుంచి తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎక్కడ ఎవరి నుంచి ఏపాటి అపచారం జరిగినా, నా కలం, గళాలు విప్పారేవి. "రాజాజీ - తెలుగు భాషకు గార్డియన్‌" బిరుదుల ఉదంతం ఇది వరకే పేర్కొన్నాను.