పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

మీఁగడ తఱకలు

ఆంధ్రదేశమున వెలసినయీకూచిపూండి భాగవతముల ప్రయోగవై శారద్యము ధక్షిణదేశమునకుఁగూడ వ్యాపించినది. ఆనాఁడు కూచిపూఁడి భాగవతుల యాటభాగవతసంప్రదాయము నేఁటికిని దక్షిణదేశమునఁ గలదు. దక్షిణదేశమున బ్రాహ్మణులు పురుషులే నేఁడును భాగవతయక్షగానములను దెనుఁగువానినే ప్రదర్శింతురు. ఆంధ్రదేశమున వెలసినయక్షగానము లిన్నూటికిఁ బైచిలుకు పరిగణింపఁబడినవి. వీని ననుసరించి వెలసిన దక్షిణదేశపుయక్షగానములు మున్నూటికిఁ బై చిలుకు గలవు. భక్తాగ్రేసరుఁ డనఁబడినశివనారాయణతీర్థులవారు (కృష్ణలీలాతరంగిణి కర్త), త్యాగరాజస్వామివారు పారిజాతాపహరణ మని, నౌకాచరిత మని భక్తిరసభరితము లయినయక్షగానములను రచించిరి. భగవత్కథలతోఁ బురాణకథలతోఁ బెంపు వెలసిన యీ భాగవతయక్షగానములు తత్ ప్రదర్శనములు నాయకరాజుల కాలమునను, మహారాష్ట్రరాజుల కాలమునను మితిమీఱి యాయారాజుల శృంగారజీవితవర్ణనాత్మకములుగాఁ గూడ రచితములై ప్రదర్శితము లగుచు వచ్చినవి. దిక్ ప్రదర్శనలుగా కొన్ని కురవంజులను, యక్షగానములను, భాగవతములను బేర్కొనుచున్నాను.

"కిరాతార్జునీయము, శ్రీగిరికురవంజి, గంగాగౌరీవిలాసము, అలమేలుమంగావిలాసము, ఎఱుకలవేషకథ, కపోతవాక్యము, గరుడాచలము, త్రిపురసంహారము, దారువనక్రీడ, నలచరిత్ర, నిజలింగచిక్కయ్యకథ, కన్యకాచరిత్ర, పారిజాతాపహరణము, పార్వతీపరిణయము, మృత్యుంజయ విలాసము, శివపారిజాతము, సముద్రమథనము, విజయరాఘవ చంద్రికావిహారము, రఘునాథనాయకాభ్యుదయము."

భిన్నపాత్రవేషధారణము లేక సింగి, సింగcడు (కొన్నింటిఁ గోణంగికూడ) పాత్రలతో వెలసినవీధినాటకము లనఁబడు కురవంజులు యక్షగానరూపమునఁ బెంపొందినపుడు వేషభేదము గల పాత్రభేదములును బెంపొందెను. ఇట్లు పాత్రబాహుళ్యముకూడఁ గలవైనయక్షగానములందు