పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

మధురకవితలు

ప్రాచీనాంధ్రలక్షణకర్తలు తెలుఁగుఁగవిత్వమును 'ఆశు, మధుర, చిత్ర, విస్తరము' లను పేళ్లఁ జతుర్విధముల విభజించిరి. యక్షగానాదు లందులో మధురకవిత్వమునఁ జేరును.

"మధురకవిత్వం బన్నది నాటకాలంకారంబులు, కళికోత్కళికలు, విభక్త్యధిదేవతోదాహరణములు, సప్తతాళనటనలు, నట్టొట్లు, గీత ప్రబంధంబులు, చతుర్భద్రికాష్టభద్రికలు, బిరుదావళి, నామావాళి, భోగావళి, రంగఘోష, త్యాగఘోష, చతురుత్తరసంఘటనలు, యక్షగానంబునవెలయు పదంబులు, దరువులు, నేలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, నుయ్యాలజోలలు, జక్కులరేకుపదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, ఏకపదద్విపద త్రిపదచతుష్బదాష్టపదులు నివియాదిగాఁ గల్గునన్నియు."

-లక్షణదీపిక

మధురకవితలు ప్రాయికముగా భాష, భావము, ఛందము దేసిగా నుండుటచే సంగీతసంస్కారము గలిగినసామాన్యజనుల నాలుకలమీఁద నాట్యమాడునవిగా నుండును, గాన తొలుత నవి యంతగా లిపి కెక్కక పోయెను. సంస్కృత ప్రాయరచనలు గలచిత్రవిస్తరకవితల ప్రాబల్యమునఁ గూడ వానికి సత్కవితలలోఁ బరిగణన మంతగా లేకపోయెను. ఇటీవల కవులుగాఁ బురాణప్రబంధరచయితలే పరిగణింపఁబడుచుండిరి గాని మధురకవితారచయితలు లెక్క కెక్కకున్నారు. ఆంధ్రవాజ్మయవృక్షమున ముఖ్యమయిన మధురకవితాశాఖ యిందాఁక సుపరిశీలనము లేకయే యున్నది. ఇక్కడ నాకిప్పుడు దేసినాటకము లనఁదగినయక్షగానరచనముల ప్రశంసయే ప్రసక్తమగుటచే వాని పుట్టుపూర్వోత్తరములఁగూర్చిమాత్రమే నాకు గోచరించినవిషయములఁ గొన్నింటి వివరింతును.