పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

57


నతిశీతలంబు లయి యున్నయవి. కొన్నిపదార్ధంబులు మంచుగడ్డలంబోలి శీతంబుచే దుస్స్పర్శంబు లయి యున్నయవి. టెంకాయనూనియ నేతి తెఱంగునం బేరుచున్నది. వార్చినతోడన పులియయందు వడ్డించిన యన్నంబు కొంత ఘృతవ్యంజనాదులతోడ మొదల భుజించి యెడఁ గలుగఁ ద్రోచి యుంచిన యవశిష్టాన్నంబు భుజియింపఁ బోయిన నొకానొకప్పుడు పర్యుషితకల్పం బయి కానంబడియెడు, మఱియు నచ్చటిచలి రేవగళ్లు హూహూకారంబుఁ బుట్టించుచున్నయది."

స్కాందపురాణాంతర్గత మగుశివరహస్యఖండము ముదిగొండ బ్రహ్మయ లింగారాధ్యకవిచే వచనకావ్యముగా రచింపఁబడెను. ఈ రచన మించుమించుగాఁ జిన్నయ్యసూరిగారికాలముననేయాంధ్రదేశమునరచింపఁ బడియుండును, కవివిషయ మంతగాఁ దెలిసినది గాదు. ఈ రచన మనుప్రాసక్లేశము గల్గి తత్సమపదబహుళమై యించుకక్లిష్టముగనే యున్నను నిర్దుష్ట మైనట్లు కన్పట్టుచున్నది. ముద్రితమై విక్రయింపఁ బడుచున్న యీగ్రంథమునుండి యుదాహరణ గైకొనలేదు.

చిన్నయ్యసూరిగారితర్వాతప్రెసిడెన్సీకాలేజీయం దాంద్రోపాధ్యాయులుగా నున్న చెదలువాడ సీతారామశాస్త్రిగారు కొన్ని సంస్కృతనాటకాదులను కథలుగా వచనమున రచించిరి. తేలికపలుకులతోఁ చక్కఁగా నర్థ మగుచు నీవచనరచన యింపు గూర్చుచున్నది. చిన్నయ్యసూరిగారికిఁ దర్వాతివచనగ్రంథకర్తలందు సంహితను బాటింపక సంధి విడఁగొట్టి వాక్యములఁ గూర్చినవారిలో వీరు తొల్తటివా రని చెప్పఁ జెల్లును. వీరి గ్రంథములును ముద్రితములై యున్నవి గావున రచన నుదాహరింపలేదు. పదపడి నాఁడునాఁటికి నాంధ్రవచనరచన క్రొత్తక్రొత్తయై పలుదెఱఁగుల వెలయుచున్నది.


  • * *