పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

51


గ్రంథములందుఁ గలదు. ఈతనిచే రాధికాసాంత్వన మనునేకాశ్వాస క్షుద్రప్రబంధము రచింపఁబడినది. కొంతకాలముక్రింద నాతాళపత్రగ్రంథమును విక్రయించుటకై యొకరు ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమునకుఁ గొనివచ్చిరి. దానిని నేను జూచితిని. ముద్దుపళని రాధికాసాంత్వనమం దిందలి పద్యము లన్నియుఁ గలవు. మఱికొన్ని పద్యము లెక్కువగాఁ జేర్పఁబడి నాల్గాశ్వాసములుగా ముద్దుపళని గ్రంథము విభక్త మయి కన్పట్టుచున్నది.

విజయరంగచొక్కభూపాలకు నాస్థానముననే కవీశ్వరుఁడుగా నున్న వెలగపూడికృష్ణకవిచే వేదాంతసారసంగ్రహ మను వచనకావ్య మొకటి రచింపఁబడెను. అది నాకుఁ జేకుఱలేదు. ఈవిజయరంగచొక్క భూపాలకుఁడు సయితము శ్రీరంగమాహాత్మ్య మనువచనకావ్యమును రచించెను. ఈవచన మంతగా నిర్దుష్ట మన వలనుపడదు.

సులువుగా నర్థ మగునట్లు వ్యావహారికశైలిని రచింపఁబడినది. ఇంచుక యుదాహరించెదను.

"అంత నవి యన్నియు దేవేంద్రుఁడు విని కోపము చేసికొని ఐరాతము నెక్కి వజ్రాయుధమును దూసికొని దేవతలనెల్ల సహాయముగాఁ గూర్చుకొని ఆరా జుండుతపస్థ్సలంబునకుం జనె. అప్పడు ఇక్ష్వాకు మహారాజు పూజాద్రవ్యముల నెత్తుకొని దేవేంద్రునికి నెదురుగాఁ బూజచేసెను. అప్పు డాదేవేంద్రుఁడు ఏకకాలంబుగాఁ గొండలుకొట్టే వజ్రాయుధమును జేతఁదీసికొని కొట్టెను. ఆదెబ్బశబ్దమునకు రాజైనతాను ఇసుమంతైన మనస్సు చలించక శ్రీమన్నారాయణమూర్తియం దుండెడు చక్రమును ధ్యానము చేసెను." ఈగ్రంథము లేఖకదోషములతో నిండియున్నది. ఇంచుక సంస్కరించి యీభాగమును మచ్చు చూపితిని.