పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

49

ఈ యభినవకాళిదాసు దైనందినప్రబంధనిర్మాణసాహసికుఁడఁట! నంజరాజయశోభూషణము ప్రౌఢరచన గల గ్రంథము. నంజరాజుచే రచింపబడిన వచనకావ్యములందు హాలాస్యమాహాత్మ్యము, విష్ణుభక్త విలాసము, హరభక్తవిలాసము, కాశీమహిమార్ధదర్పణము ననునవి నాకుc జేకుఱినవి. హాలాస్యమాహాత్మ్యమున నీనంజరాజు తనతండ్రిని

ఉ|| ఆదళవాయి దొడ్డవసుధాధిపమౌళికిఁ గల్గె సజ్జనా
      హ్లాదకరుండు షోడశమహాద్భుతదానధురంధరుండు తే
      జోదిననాథుఁ డంచితయశోధవళీకృతసర్వదిక్తటుం
      డాదినృపాలసన్నిభుఁ డుదారుఁడు వీరనరేంద్రుఁ డున్నతిన్||

అని వర్ణించెను. ఈతనికబ్బములలో హాలాస్యమాహాత్మ్యము స్కాందపురాణ మందలి దక్షిణమధురాపురీమహిమమును దెలుపు హాలాస్యఖండమునకు సరిగాఁదెలుఁగున రచియింపఁబడినదెబ్బదిరెండధ్యాయముల వచన కావ్యము. నంజరాజకవి వచనరచన మించుక ప్రౌఢమై మిక్కిలి చక్కఁగనే యున్నను వచనభారతశైలికిఁగొండొక వెన్బడుచున్నది. అందందు, వ్యాకరణాపాకరణము లేకపోలేదు. ఈకవినిగూర్చి శ్రీవీరేశలింగము పంతులుగారు కొంత వ్రాసియున్నారు. గ్రంథవిస్తరభీతిచేఁ దక్కినగ్రంథముల వదలి హాలాస్యమాహాత్మ్యమునుండియే మచ్చున కించుక వచనభాగమును జదివెదను.

"ఆసిద్దండు భయభక్తియుక్తుం డగురాజుం గనుంగొని వాంఛితార్థమ్ము వేఁడుకొ మ్మనుచుఁ బలుక నమ్మహీపాలుం డతనికిం బ్రణమిల్లి యంజలి గావించి సద్గుణవంతుc డగుపుత్రుం గరుణింపు మని యభ్యర్ధింప సిద్ధవేషధరుండును సచ్చిదానందస్వరూపుండును భగవంతుండు నగుహాలాస్యనాథుండు ఓయి పాండ్యభూపాలకా! నీ కత్యంతైశ్వర్యసమేతుం డగుపత్రుండును గీర్తియు దీర్గాయుష్యంబును గడపల శాశ్వతం బగుముక్తియుం గలుగుంగాక యని వచియించి, గజముఖంబువలన నేకావళియుc దీసి