పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

మీఁగడ తఱకలు

(2) అత్యుగ్రబాణశక్తిఁ దన్నుఁ బంపు దేవ (మన్మథుని పల్కు) (నన్నిచోడదేవుఁడు) ఇట్లు కొంత ప్రాచీనప్రయోగసరణి కలదు.

మఱియు

(1) శంతనునరపాలుఁ డేకాంతంబున నేకాంతం గనుఁగొని మరులుకొనియె యథార్ధంబునఁబలుకరింపు మన సూతుం డిటులను,

(2) నే నిక్కన్నియకు జనకుండ నగుటం జేసి పలుకరించెద నాకర్ణింపుము -ఇట్లు పెక్కువాక్యములందు 'పలుకు' ధాతువు ప్రయోగింపఁ బడునెడ 'బలుకరించు' ధాతువు ప్రయోగింపఁ బడినది. ప్రాచీనగ్రంథములఁ దిట్టి ప్రయోగములు కలవో యని సందియ మగుచున్నది. ప్రయోగ వైచిత్ర్యము లిట్టివి కొన్ని గలవు.

మఱియు నిందుఁ దత్సమక్రియలకు శత్రర్ధమున నింపు గాగమము తఱచుగాఁ గావింపఁబడినది. దక్షిణదేశపుఁ బ్రబంధములం దెల్ల నిట్టి ప్రయోగములు కుప్పతెప్పలుగాఁ గలవు. ఆంధ్రదేశమందు రచింపఁబడిన వసుచరిత్రాది ప్రబంధములందును గలవు. పెద్దనామాత్యుఁడ కూడ 'ఇంపు మీఱంగ ధాత్రి పాలింపుచుండ' అని ప్రయోగించెను. ఇది ప్రాచీన కవిసమ్మతము కాదు.

అమహదర్థక మగుతచ్ఛబ్దమునకు 'వాటిని' మొదలగు రూపములు గూడ వాడఁబడినవి. అయ్యవి యసాధువులు. ఇంక నెందేనిఁ జిన్ని చిన్ని దోషము లిట్టివి మఱికొన్నియు నుండిన నుండఁబోలును. బహుస్థలములందుఁ జూపట్టు చుండుటచేఁ బైప్రయోగములు గ్రంథకర్తృ కృతములే యని చెప్పవలసియున్నది. ప్రాయికముగాఁ దాళపత్ర సంపుటములు లేఖకదోషభూయిష్ఠములై యుండును. అట్టి దోషములను గూడc దద్గ్రంథకర్తలకుం దగిలింపరాదు.